
అమరావతి: లాక్డౌన్ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనికరం చూపారు. సీజ్ చేసిన వాహనాలను తిరిగి వాటి యజమానులకు ఇచ్చేయాల్సిందిగా ఆదేశించారు.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కాలంలో అనవసర కారణాలతో కొందరు తమ వాహనాలతో రోడ్లు ఎక్కేవారు.
అలాంటి వారిని గుర్తించి, వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఏపీలో లాక్డౌన్ నిబంధనల్లో చాలా మేరకు సడలింపు ఇచ్చిన నేపథ్యంలో ఈ వాహనాలను ఏం చేయాలన్న ప్రశ్న ఉత్పన్నమైంది.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాల సహా కోర్టులో అప్పజెప్పాలని తొలుత ఏపీ పోలీసులు భావించారు.
అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం సీజ్ అయిన వాహనాల యజమానులను కనికరించారు. ఆయా వాహనదారుల నుంచి రూ.100 జరిమానా కింద కట్టించుకుని వాహనాలు ఇచ్చేయమన్నారు.
కాకపోతే, మళ్లీ ఇలా ట్రాఫిక్ నిబంధనలు, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించబోమంటూ వాహనదారుల నుంచి హామీ పత్రం తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఆయన సూచించారు.
అలాగే వాహనాలు ఇచ్చే సమయంలో కూడా కోవిడ్19 జాగ్రత్తలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలంటూ జగన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.








