లండన్: బ్యాంకులకు భారీ స్థాయిలో రుణాలు ఎగవేసి బ్రిటన్ పారిపోయిన విజయ్ మాల్యాను భారత్ రప్పించేందుకు పోరాడుతున్న 13 బ్యాంకుల కన్సార్టియంకు గొప్ప విజయం లభించింది. లండన్‌లోని విజయ్ మాల్యా ఆస్తులను సీజ్ చేసేందుకు లండన్ కోర్టు అనుమతించింది. ఈ ఆదేశాలను ఉపయోగించుకుని 1.145 బిలియన్ పౌండ్ల విలువైన నిధులను రికవరీ చేసుకోవాలని బ్యాంకులకు సూచించింది.
భారత్‌లోని 13 బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర ఎగవేసిన విజయ్ మాల్యా మార్చి 2, 2016లో లండన్ పారిపోయాడు. అప్పటి నుంచి అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా లండన్ కోర్టు ఇచ్చిన తీర్పు భారతీయ బ్యాంకుల కన్సార్టియంకు పెద్ద ఊరటగా నిలిచింది.
కోర్టు తాజా ఆదేశాలతో లండన్ సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్ షైర్లో ఉన్న విజయ్ మాల్యా ఆస్తులలోకి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రవేశించవచ్చు. లేడీవాక్, టెవిన్‌లోని బ్రాంబెల్ లాడ్జ్, వెల్విన్‌లలోకి కూడా అధికారులు ప్రవేశించవచ్చని కోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుతం విజయ్ మాల్యా ఇక్కడే ఉంటున్నారు.
‘‘హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ అధికారి, ఎవరైనా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ నేతృత్వంలో విజయ్ మాల్యా భవంతుల్లోకి ప్రవేశించవచ్చు. ఆయన ఆస్తులను తమ నియంత్రణలోకి తీసుకోవచ్చు..’’ అని లండన్ కోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. అవసరమైతే పోలీసు ఫోర్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. అలాగే, పీఎంఎల్ఏ కోర్టులో మాల్యా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.