ఇక వలసదారులకు నో గ్రీన్ కార్డ్.. ట్రంప్ షాకింగ్ నిర్ణయం!

donald-trump
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో ఉంటోన్న వలసదారులకు మరో షాక్ ఇవ్వబోతున్నారు.  ఈసారి ట్రంప్ దెబ్బ గ్రీన్ కార్డులపై పడబోతోంది. అసలు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పట్నించి అక్కడి వలసదారులను ఏదో ఒక రకంగా దెబ్బ మీద దెబ్బ తీస్తూనే ఉన్న డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయం అక్కడి భారతీయులకు గుదిబండగా మారనుంది.

మొన్నటికి మొన్న హెచ్4 వీసాలపై కఠిన నిర్ణయం తీసుకున్న ట్రంప్ సర్కార్… తాజాగా గ్రీన్ కార్డులపై మరో కఠిన నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇకమీదట అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు గ్రీన్ కార్డు జారీ చేయకూడదని ట్రంప్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. ఇది అమల్లోకి వస్తే గ్రీన్ కార్డు ద్వారా లభించే ప్రభుత్వ పథకాలు, నగదు సహాయం తదితరాలు నిలిచిపోతాయి.

ఈ కొత్త ప్రతిపాదనపై హోమ్‌లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ సెప్టెంబర్ 21న సంతకం కూడా చేసేశారు. అంతేకాదు, ఈ ప్రతిని హోమ్‌లాండ్ సెక్యూరిటీ శాఖ తన వెబ్‌సైట్‌లో కూడా పొందుపర్చింది.  ఉన్నట్లుండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శరాఘాతం లాంటి నిర్ణయం తీసుకోవడంపై సిలికాన్ వ్యాలీలో పని చేస్తున్న టెక్కీలు భగ్గుమంటుండగా, ఇతర రాజకీయపార్టీలు సైతం మండిపడుతున్నాయి.

కొత్త నిబంధన ప్రకారం…

ట్రంప్ సర్కారు తాజా నిర్ణయం ప్రకారం గ్రీన్ కార్డు కోరుతున్న వలసదారులు తాము ప్రభుత్వ పథకాలను లేదా ఫలాలను వినియోగించుకోబోమని పేర్కొంటూ సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్-4 వీసాదారులకు పని పరిమితులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో తాజాగా గ్రీన్ కార్డు పై ఈ రకమైన కొత్త నిబంధనలు తీసుకురావడం అమెరికాలో ఉంటోన్న భారతీయులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది.

అంతేకాదు, ఇకమీదట అమెరికాకు రావాలని భావించేవారు ఆర్థికంగా తమకు తామే నిలదొక్కుకోగలమనే భరోసా ఇస్తూ అందుకు సంబంధించి పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుందని హోమ్‌లాండ్ సెక్యూరిటీ శాఖ పేర్కొంది. త్వరలోనే గ్రీన్ కార్డుపై తీసుకొస్తున్న కొత్త ప్రతిపాదనల అమలుకు బిల్లు ప్రవేశపెట్టి కాంగ్రెస్‌లో పాస్ చేయించి చట్టం చేస్తామని కూడా హోమ్‌లాండ్ సెక్యూరిటీ శాఖ అధికారులు చెబుతున్నారు.

వలసదారులు కచ్చితంగా తమ ఆర్థిక స్థోమతను నిరూపించుకోవాల్సి ఉంటుందని, అంతేకాక అమెరికాలో పన్ను కడుతున్న అమెరికన్లకు భారం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు ట్రంప్ సర్కారు పేర్కొంటోంది.

పెల్లుబుకుతున్న వ్యతిరేకత…

అయితే వలసదారుల విషయంలో ట్రంప్ సర్కారు తాజా ప్రతిపాదన, నిర్ణయంపై ఎఫ్‌డబ్ల్యూడీ అనే సంస్థ మండి పడింది.  ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, డ్రాప్ బాక్స్, యాహూ, గూగుల్ లాంటి సంస్థలకు ఈ సంస్థ  ప్రాతినిధ్యం వహిస్తోంది.  అధ్యక్షుడు ట్రంప్ తాజా నిర్ణయంతో దేశం పెద్ద ఎత్తున నష్టపోతుందని,  ఈ విధానం అమలు అయితే దేశ అభివృద్ధికి తోడ్పడే వలసదారులను దేశం కోల్పోతుందని, ఈ చర్య దీర్ఘకాలంలో అమెరికాకు భారీ నష్టం కలుగజేస్తుందని ఎఫ్‌డబ్ల్యూడీ వాదిస్తోంది.

ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డు కోసం 6,32,219 మంది భారతీయులు, వారి పిల్లలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ కొత్త ప్రతిపాదనలు అమలు చేయడమంటే అమెరికా ప్రభుత్వం నేరుగా ప్రజల ఆరోగ్యం, నివాసం, ఆర్థిక భద్రతను అణిచివేయడమే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.  తక్కువ వేతనాలు పొందుతున్న తల్లిదండ్రులకు శిక్ష విధించకూడదని, వారి పిల్లలను కష్టాలపాలు చేయరాదని సూచిస్తున్నారు.

- Advertisement -