హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నివాసంపై గురువారం ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఓటుకు కోట్లు కేసు, జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసులలో ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చిన రెండు ఐటీ శాఖ బృందాలు హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసంతోపాటు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించింది. రేవంత్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, సన్నిహితులైన మరో 15 మంది ఇళ్లు, వారి కార్యాలయాలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడికి సంబంధించిన పలు కంపెనీల లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఉండగా.. ఆయన కుటుంబ సభ్యులు తిరుపతిలో ఉన్నారు. ఐటీ శాఖ అధికారులు ఆయా ప్రాంతల్లో అక్కడ ఉన్న సిబ్బందికి నోటీసులు ఇచ్చి దాడులు చేసినట్టు తెలుస్తోంది. సోదాల సమయంలో అధికారులు… ఆయా చోట్ల కుటుంబ సభ్యుల మెబైల్ ఫోన్‌లను స్విచ్చాఫ్ చేయించారని సమాచారం. ఆస్తిపత్రాలు, భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, వ్యాపార లావాదేవీలు, లెక్కలు సరిగ్గా లేని అక్రమ ఆర్థిక లావాదేవీలపై అధికారులు దృష్ట సారించినట్లు సమాచారం.
రాజకీయ కక్షలో భాగంగానేనా…
ఈ దాడుల విషయం తెలియగానే రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఆయన నివాసానికి తరలి వచ్చారు. రాజకీయ కక్షలో భాగంగానే ఈ దాడులు అని వారు ఆరోపిస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సోదాల విషయం తమకు ముందుగా తెలియదని ఇక్కడి పోలీసులు చెబుతున్నారు.
సీబీఐ, ఈడీ, ఇన్‌కంట్యాక్స్‌లతో తనపై కక్ష సాధింపునకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రయత్నాలు చేయిస్తున్నారని.. తనకు, తన కుటుంబానికి ఏం జరిగినా కేసీఆర్‌తోపాటు ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు, డీజీపీ మహేందర్ రెడ్డిలే బాధ్యత వహించాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఈ ఐటీ దాడులు జరగడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి నివాసంపై ఐటి దాడులు జరగటం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇటీవలే ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపిన విషయం తెలిసిందే.