
రష్యా: ఈ ప్రపంచంలో కల్తీ లేకుండా ఏమైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమ మాత్రమే. కానీ కొందరు తల్లులు వికృత చేష్టలతో ఆ అమ్మతనానికే చెడ్డపేరు తెస్తున్నారు. మూడ్ బాలేదని రష్యాలో ఓ యువతి అమానుషంగా ప్రవర్తించింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డను బిల్డింగ్ మీద నుంచి కిందికి తోసేసింది.
తర్వాత ఏమైందో ఏమో ఆమె కూడా అదే బిల్డింగ్ పైనుంచి దూకేసింది. అయితే వారి అదృష్టం బాగుండి తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా బయట పడ్డారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది.
దక్షిణ రష్యాలోని యూఎఫ్ఏ ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఇద్దరు కూతుళ్లు. రెండో కూతురి వయసు రెండేళ్లే. ఇటీవల ఏమైందో తెలీదు కానీ ఆమె యమా చిరాకుగా ఫీల్ అయ్యింది. ఇంతలో కూతురు ఏడుపు మొదలెట్టడంతో ఆ చిరాకు మరింత అధికమైంది.
కన్నకూతురు అనే విచక్షణ కూడా మరిచి, చిన్నారిని వాళ్లు ఉంటున్న భవనం తొమ్మిదో అంతస్తు నుంచి కిందకి విసిరేసింది. ఆ తర్వాత ఆమె కూడా బిల్డింగ్ మీద నుంచి దూకేసింది. అయితే కొన్ని రోజులుగా రష్యాలో మంచు కురుస్తోంది. దీంతో పైనుంచి పడిన వీరిద్దరూ కింద దట్టంగా పేరుకుపోయిన మంచులో కూరుకుపోయారు.
ఆ తరువాత కొద్దిసేపటికే ఇద్దరినీ గమనించిన స్థానికులు ఆ మంచులోనుండి బయటకి తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం నుంచి తల్లీకూతుళ్లు ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు.
పొరపాటున కిటికీలోంచి జారిపడ్డారేమోనని తొలుత అనుమానించి పోలీసులు, ఆ యువతి చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయారు. ఆ వెంటనే ఆమెపై కేసు నమోదు చేశారు. కావాలనే బిడ్డను పడేసినట్టు నేరాన్ని అంగీకరించిన యువతికి రష్యా చట్టాల ప్రకారం ఐదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.








