
కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఏ మాత్రం ఉందని తేలినా పులివెందల నడిబొడ్డున ఉరితీయాలని ఆ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి అన్నారు. ఎక్కడ ఏ ఘటనా జరిగిన వైసీపీ నేతలు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు.
బుధవారం వివేకానందరెడ్డి హత్య ఘటనపై ఆయన కుమార్తె సునీతా రెడ్డి మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది గంటల తర్వాత సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి హత్య విషయంలో సునీత చెప్పిన విషయాలన్నీ సరైనవేనని, చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదని అన్నారు. అందుకే ఆయన చనిపోయిన రోజు నుంచి తాము ఒక్క వ్యాఖ్య కూడా వ్యతిరేకంగా చేయలేదని తెలిపారు.
గౌరవ సూచకంగా ప్రచారం ఆపేశా..
వివేకానందరెడ్డి హత్య జరిగినట్లు ఆరోజు సాయంత్రం తెలిసిందని, దీంతో గౌరవ సూచకంగా తాను ప్రచారం నిలిపేశానని సతీష్ రెడ్డి తెలిపారు. వివేకానంద రెడ్డిని హత్య చేశారు.. ఇందులో చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి ఇందులో భాగం అంటూ రాత్రి 11గంటల సమయంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారని ధ్వజమెత్తారు.
ప్రతి సందర్భంలోనూ వైసీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తమకూ కుటుంబాలు ఉంటాయని, ఈ ఆరోపణలు తమ కుటుంబసభ్యులను క్షోభకు గురిచేస్తున్నాయని వాపోయారు. పులివెందులలో జరిగిన అన్ని ఘటనలపై చర్చ జరిపేందుకు తాను సిద్ధమని అన్నారు.








