
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరగా.. తాజాగా, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతానని ప్రకటించారు.
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమైన హర్షవర్ధన్ పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని హర్షవర్ధన్ తెలిపారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. కేసీఆర్‌పై విశ్వాసంతో నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తా…
తిరిగి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా నియోజకవర్గ ప్రజలు, అభిమానులతో చర్చించిన తర్వాతనే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నానని ఎమ్మెల్యే హర్షవర్ధన్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందిందన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని తెలిపారు. తనకిప్పుడు నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యంమని స్పష్టం చేశారు.
శ్రీశైలం ముంపు బాధితులకు ఉద్యోగ అవకావాలు కల్పించడం, సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం, పాలమూరు-రంగారెడ్డి ముంపు బాధితులకు నష్టపరిహారం, మాదాసి, కుర్వ సోదరుల దీర్ఘకాలిక సమస్యలను పరిశీలించి న్యాయం చేయాలని కోరినట్లు చెప్పారు. ఇప్పటికే పలువురు టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.








