దయచేసి ఇక్కడ రాజకీయ చర్చలు పెట్టకండి: బోర్డు పెట్టిన కాఫీ షాపు యజమాని!

- Advertisement -

బెంగుళూరు: ఇప్పుడు అసలే ఎన్నికల కాలం.. అంతటా ఉత్కంఠ. కేంద్రంలో ఎవరు గెలుస్తారు?.. రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి వచ్చేదెవరు?.. ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయి?.. రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంతటా ఇదే చర్చ.

ముఖ్యంగా టీవీ చానళ్లలోని చర్చా వేదికల్లో ఏ స్థాయిలో అయితే వాద ప్రతివాదనలు జరుగుతాయో.. గల్లీల్లోని చాయ్ దుకాణాల్లోనూ అదే స్థాయిలో రాజకీయ చర్చలు జరుగుతుంటాయి.  ఒక్కోసారి ఆ చర్చలు శృతిమించి గొడవలు జరిగే వరకూ వెళ్తుంటాయి కూడా.

అయితే కర్ణాటకలోని మాండ్యలో ‘ది కాఫీ బీన్’ అనే దుకాణం యజమాని తన హోటల్‌లో ఇలాంటి చర్చలకు తావివ్వరాదని వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. టీ తాగేందుకు వచ్చే వారెవరూ రాజకీయాల గురించి మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఆ మేరకు తన చాయ్ దుకాణం ఎదుట బోర్డు కూడా ఏర్పాటు చేశాడు.

‘‘దయచేసి ఇక్కడ రాజకీయాల గురించి చర్చించొద్దు. టీ, కాఫీ తాగి క్షేమంగా వెళ్లి రండి..’’ అని బోర్డుపై పేర్కొన్నాడు. అయితే ఆ యజమాని ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఆయన షాపుకు వచ్చే వారందరూ రాజకీయాల గురించి చర్చించే వారేనట.

ఒక్కోసారి గొడవలు పడ్డ సందర్భాలూ ఉన్నాయట. ఈ కారణంగానే ఈసారి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సదరు చాయ్ దుకాణం యజమాని చెప్పుకొచ్చారు. అయితే టీ తాగేందుకు వచ్చే వారు కూడా షాపు యజమాని నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. షాపులో ఉన్నంత సేపు రాజకీయాల గురించి చర్చించబోమంటున్నారు. ఏదేమైనా షాపు యజమాని తీసుకున్న నిర్ణయం మంచికే కదా?

- Advertisement -