26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం నిజం ఒప్పుకుంది కానీ..: ఎఫ్-16 యుద్ధ విమానం కూల్చివేతపై మాట మార్చిన పాక్…

నిజం ఒప్పుకుంది కానీ..: ఎఫ్-16 యుద్ధ విమానం కూల్చివేతపై మాట మార్చిన పాక్…

Pakistan Latest News, Indian Army Latest News, Newsxpressonline
- Advertisement -

ఇస్లామాబాద్‌: మాటమార్చినా.. పాకిస్తాన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకుంది. పుల్వామా దాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్ మధ్య జరిగిన వైమానిక పోరులో ఎఫ్‌-16 వాడలేదని దాయాది దేశం మొండిగా వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ విషయంపై మాట మార్చినా నిజం అంగీకరించింది.

స్వీయ రక్షణలో భాగంగా ఎటువంటి యుద్ధవిమానాన్నయినా ఉపయోగిస్తామంటూ చెప్పుకొచ్చింది. ఈ మేరకు పాక్‌ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఓ ప్రకటనను విడుదల చేసింది.

‘‘ఇరు దేశాల మధ్య జరిగిన వైమానిక పోరులో మేం(పాక్‌) ఎఫ్‌-16 యుద్ధ విమానాలను వినియోగించామని భారత్ చెబుతూ వస్తోంది. వాడింది ఏ రకం యుద్ధ విమానం అన్నది అప్రస్తుతం. ఆ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం ఎఫ్‌-16లతో సహా గాల్లో సిద్ధంగా ఉంది..’’ అని ఆ ప్రకటనలో పాక్ పేర్కొంది.

ఈ క్రమంలో స్వీయ రక్షణలో భాగంగా భారత్‌కు చెందిన విమానాలకు కూల్చామన్నది వాస్తవం. అలాగే భారత్‌ కూడా ఎటువంటి యుద్ధ విమానాన్నైనా వాడుకోవచ్చు. నిబంధనలకు లోబడి ఆత్మరక్షణలో భాగంగా ఎటువంటి విమానాన్నయినా ఉపయోగించే హక్కు పాకిస్తాన్‌కు ఉందని ప్రకటనలో వెల్లడించింది.

మళ్లీ అదే వాదన…

అయితే, ఆరోజు వాడింది ఎఫ్‌-16 కాదని.. జేఎఫ్‌17 అని మరోసారి మొండి వాదనకు దిగింది. దీనిపై స్పందించిన ఢిల్లీలోని కొంత మంది అధికారులు.. ఈ ప్రకటనతో పరోక్షంగా పాకిస్తాన్ ఎఫ్-16ను వాడినట్లు అంగీకరించిందని అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లు పాక్‌ ఆర్మీ అధికార ప్రతినిధి ఆసిఫ్‌ గఫూర్‌ ఖాన్‌ చెబుతూ వస్తున్న ప్రకటనలకు ఇది పూర్తి భిన్నం అని చెప్పారు.

పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌కు చెందిన ఓ ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని భారత్‌ కూల్చింది. కానీ, పాక్‌ మాత్రం దీన్ని నిరాకరిస్తూ వచ్చింది. మరో దేశంపై దాడి చేయడానికి ఎఫ్‌-16లను ఉపయోగించొద్దని నిబంధనలు తెలియజేస్తున్నాయి.

కాగా, ఎఫ్-16 యుద్ధ విమానాన్ని వినియోగం నేపథ్యంలో పాక్‌పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

చదవండి: శత్రుదేశాల రాడార్లకు చెక్: పీఎస్ఎల్వీ సీ45 ప్రయోగం విజయవంతం
- Advertisement -