వాషింగ్టన్: ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పదవికి గండం ఏర్పడింది. అవును, ఫేస్‌బుక్‌లో తప్పుడు వార్తల కలకలం, వినియోగదారుల సమాచార తస్కరణ తదితర అంశాలు చివరికి ఆయన పదవికే ఎసరు తెచ్చాయి.
ఫేస్ బుక్ ఇన్‌కార్పొరేషన్‌లో మెజారిటీ వాటా ఉన్న నాలుగు యూఎస్ ఫబ్లిక్ ఫండ్ సంస్థలు ఆయన్ను ఛైర్మన్ పదవి నుంచి తొలగించాల్సిందేనంటూ మొట్టమొదటిసారి ప్రతిపాదన చేశాయి. ఇక సంస్థ అసెట్ మేనేజర్లు కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెబితే.. మార్క్ జుకర్‌బర్గ్ పదవి ఊడినట్లే అంటున్నారు.
ఇల్లినాయిస్, రోడ్ ఐలండ్, పెన్సిల్వేనియాలకు చెందిన స్టేట్ ట్రెజర్స్, న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ స్కాట్ స్ట్రింగర్ ఫండ్స్ సంస్థలు జుకర్‌బర్గ్‌ను ఛైర్మన్ పదవి నుంచి తొలగించి, ఆ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి. డేటా తస్కరణ, కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణం నుంచి సంస్థను బయటపడేయాలంటే.. మార్క్ జుకర్ బర్గ్ ను తప్పించడమే ఉత్తమమని రోడ్ ఐలండ్ స్టేట్ ట్రెజర్స్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
ఫేస్‌బుక్ తదుపరి సర్వసభ్య సమావేశం 2019 మేలో జరగనుంది. ఈ వార్షిక సమావేశంలో జుకర్‌బర్గ్ తొలగింపునకు సంబంధించిన అంశంపై చర్చిస్తామని ఫేస్‌బుక్ చీఫ్ సేథ్ మాగజైనర్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు, ఇండిపెండెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేయనున్నట్టు ఆయన తెలిపారు.
మరోవైపు జుకర్ బర్గ్‌ను ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తారనే వార్తలతో సామాజిక మాధ్యమాల్లో అత్యధిక మార్కెట్ వాటాను కలిగివున్న ఫేస్ బుక్ ఈక్విటీ 10 శాతం పడిపోయింది. అయితే, జుకర్ బర్గ్ కు ఫేస్‌బుక్‌లో 60 శాతం ఓటింగ్ హక్కు ఉందని, కాబట్టి ఆయన తొలగింపు అంత సులువేమీ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.