26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం కరోనాతో ప్రాణ స్నేహితుడి మృతి.. విషాదంలో అగ్ర రాజ్యం అధినేత!

కరోనాతో ప్రాణ స్నేహితుడి మృతి.. విషాదంలో అగ్ర రాజ్యం అధినేత!

trump-developer-friend-stanley-chera-dies-of-covid19-infection
- Advertisement -

వాషింగ్టన్: అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ విషాదానికి లోనయ్యారు. ఆయన ప్రాణ స్నేహితుడు, రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన స్టాన్లీ చెరా(78) గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌తో పోరాడి చివరికి కన్నుమూశారు. 

న్యూయార్క్ నగరంలో నివసించే స్టాన్లీ చెరా ‘క్రౌన్ అక్విజిషన్స్’ అనే సంస్థను స్థాపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండే వారు. ఆయన అనేక భారీ భవంతులు కూడా నిర్మించారు. అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం నేపథ్యంలో స్టాన్లీ కూడా దాని బారిన పడ్డారు. ఈ విషయాన్ని కొద్దిరోజుల క్రితం మీడియా సమావేశంలో ట్రంప్ స్వయంగా వెల్లడించారు.

ట్రంప్ అల్లుడితో వ్యాపార సంబంధాలు…

ట్రంప్ అల్లుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన జేర్డ్ కుషనర్‌తో స్టాన్లీకి వ్యాపార సంబంధాలున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రచారం కోసం కూడా ఆయన సుమారు 4 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారు. 2019లో న్యూయార్క్‌లో జరిగిన ‘వెటరన్స్‌ డే పరేడ్‌’లో స్టాన్లీ తన ప్రాణ స్నేహితుడంటూ ట్రంప్ అందరికీ పరిచయం కూడా చేశారు. 

చదవండి: అమెరికాలో అల్లకల్లోలం.. మరణిస్తున్న వారిలో సగం మంది న్యూయార్క్‌ వాసులే!

మార్చి 24న ఆసుపత్రిలో చేరిన స్టాన్లీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. పరిస్థితి విషమించడంతో చివరికి తుదిశ్వాస విడిచారు.

సగటున గంటకు 83 మంది మృతి…

మరోవైపు అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో 5.5 లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా, 21 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

రోజూ వేలాది మందికి ఈ వైరస్ సోకుతుండగా, వందల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు.  సగటున గంటకు 83 మంది మరణిస్తున్నారంటూ ఓ అధ్యయనం వెల్లడించిందంటే.. అమెరికాలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  

- Advertisement -