
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్ విషయమై ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు తెర దించారు. లాక్‌డౌన్‌ను మే 3 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. కరోనాపై భారత్ పోరు ఇప్పటి వరకు అద్భుతంగా సాగిందన్నారు. మరికొంత కాలం ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, కరోనా వైరస్‌పై విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
చదవండి: లాక్‌డౌన్‌పై కొత్త మార్గదర్శకాలు.. ఇక రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు!
లాక్‌డౌన్ అంశంపై ఇప్పటికే తాను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడానని, కరోనాను సమర్థంగా ఎదుర్కోవడంలో దీన్ని మించిన వ్యూహం మరొకటి లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ సామాజిక దూరం పాటించడమే దీనికి సరైన మందు అని, అందుకే లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నామని చెప్పారు.
ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు…
ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాయని, ఇంకా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరాయని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. అయితే ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు ఉంటాయని, అత్యవసర విషయాల్లో అనుమతులు ఉంటాయని ప్రధాని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు విషమ పరిస్థితులను ఎందుర్కొంటున్నాయని, ఇతర దేశాలతో పోల్చితే.. మన దేశం చాలా మెరుగైన స్థితిలో ఉందని మోడీ వ్యాఖ్యానించారు.
చదవండి: కరోనాతో ప్రాణ స్నేహితుడి మృతి.. విషాదంలో అగ్ర రాజ్యం అధినేత!
నెల రోజుల క్రితం భారత్‌తో సమానంగా ఉన్న కొన్ని దేశాల పరిస్థితి ఇప్పుడు జఠిలంగా మారిందని, ఆ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి 25 శాతం వరకు పెరిగిందని ఆయన చెప్పారు. వేలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారని, అలాంటి పరిస్థితి మన దేశంలో లేదన్న ఆయన దీనికి మనం అనుసరిస్తున్న విధానమే కారణమన్నారు.
ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం, అయినా…
దేశంలో లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం పడిందని, అయినప్పటికీ ప్రజల ప్రాణాలకంటే డబ్బు ముఖ్యం కాదని మోడీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు ఈ విషయంలో భారత్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.
‘‘దేశంలో కరోనాపై పోరాటం మహోజ్వలంగా కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తిని మనం చాలా వరకు నియంత్రించగలిగాం. మీ అందరి సహకారం వల్లనే ఇది సాధ్యమవుతోంది. చాలా బాధ్యతాయుతంగా పని చేశాం. అందరమూ కలిసి సత్ఫలితాలు సాధించాం. మనం ఇలా చేసి ఉండకపోయుంటే ఎంతో నష్టం జరిగి ఉండేది..’’ అని మోడీ పేర్కొన్నారు.
‘‘నాకు ప్రజల అన్ని ఇబ్బందులూ తెలుసు..’’
కరోనాపై పోరు సాగించే క్రమంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్న విషయం కూడా తనకు తెలుసునని, లాక్‌డౌన్ కారణంగా రవాణా సదుపాయాలు స్తంభించిపోవడంతో ఎక్కడి వారు అక్కడే తమ కుటుంబాలకు దూరంగా ఉండిపోయారని, కొంతమంది తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నారని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: మందుబాబులు ఎగిరి గంతేసే వార్త చెప్పిన మేఘాలయ సర్కార్
ఈ ఇబ్బందుల నడుమే పండుగలను కూడా ఎవరింట్లో వారే జరుపుకున్నారు. అయితే ప్రతి ఒక్కరూ సైనికుల్లా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు.. ఈ సందర్భంగా తాను అందరికీ వందనాలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా మనం ఎన్నకున్న విధానమే సరైనదని నిరూపితమైందని.. లాక్‌డౌన్, సోషల్ డిస్టెన్స్ మన దేశాన్ని కాపాడాయి అని ప్రధాని అన్నారు.
ఇదే అంబేద్కర్‌కు నిజమైన శ్రద్ధాంజలి…
‘‘మన రాజ్యాంగం ‘పీపుల్ ఆఫ్ ఇండియా’ అనే పదంతో మొదలవుతుంది. కరోనాపై పోరు కూడా ప్రజలందరి సమష్టి శక్తితోనే సాగుతోంది. ఈ మహమ్మారిపై సాగిస్తోన్ పోరులో మన సామూహిక శక్తిని ప్రదర్శించాం. మన సంకల్ప శక్తి గొప్పది. ఇదే అంబేద్కర్‌కు మనం సమర్పించే సరైన శ్రద్ధాంజలి. ఆయన భావాలు మనకు నిరంతరం ప్రేరణ ఇస్తాయి..’’ అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
కరోనా హాట్‌స్పాట్‌లపై ఫోకస్…
దేశంలో కరోనా హాట్‌స్పాట్‌లపై ఫోకస్ పెట్టినట్లు ప్రధాని ప్రకటించారు. హాట్‌స్పాట్ కాని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తరువాత ఆంక్షల సడలింపు ఉంటుందని చెప్పారు. నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కొత్తగా కరోనా కేసులు నమోదు కాని ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి సడలింపులు ఉంటాయన్నారు.
ఈ వారం ఇండియాకు అత్యంత క్లిష్టమైన వారమని వ్యాఖ్యానించిన ప్రధాని లాక్‌డౌన్‌పై మార్గదర్శకాలను బుధవారం విడుదల చేస్తామని, కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాలని సూచించారు.
మోడీ ‘సప్తసూత్రావళి’ ఇదే…
1. సీనియర్ సిటిజన్లు జాగ్రత్తగా ఉండాలి.
2. కరోనా వైరస్ జరుపుతోన్న పోరులో అత్యవసర సేవల్లో విధులు నిర్వర్తిస్తోన్న వారిని అందరూ గౌరవించాలి.
3. పేదలు, అన్నార్తులకు మరింత సహాయం చేయాలి.
4. ఏ ప్రైవేటు సంస్థ తన ఉద్యోగులపై వేటు వేయకూడదు.
5. ప్రజలు తమ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.
6. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి.
7. ఎవరికి వారు భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్‌ను తరిమికొట్టాలి.








