
న్యూయార్క్: అమెరికాలో కరోనా కరాళ నృత్యానికి భారతీయులు బలవుతున్నారు. కోవిడ్ కాటుకు ఇప్పటి 11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
కోవిడ్-19 బారినపడి అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు 14 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 4 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కారణంగా చనిపోయిన భారతీయులందరూ పురుషులేనని, వారిలో 10 మంది న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలకు చెందిన వారని అధికారులు తెలిపారు.
వీరిలో నలుగురు న్యూయార్క్‌లో ట్యాక్సీ డ్రైవర్లని పేర్కొన్నారు. అమెరికాలో సంభవిస్తున్న మరణాల్లో అత్యధికశాతం న్యూయార్క్‌లోనే నమోదవుతున్నాయి.
ఇక్కడ దాదాపు 6 వేల మంది మృతి చెందారు. 1.38 లక్షల మంది బాధితులుగా మారారు. న్యూజెర్సీలో 1500 మంది చనిపోగా, 48 వేల కేసులు నమోదయ్యాయి.
ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఫ్లోరిడాలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. కరోనా వైరస్ బారిన పడిన 16 మంది భారతీయులు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
వీరిలో 8మంది న్యూయార్క్‌కు చెందినవారు కాగా, ముగ్గురు న్యూజెర్సీ వారు ఉన్నారు. మిగిలిన వారు టెక్సాస్, కాలిఫోర్నియాకు చెందిన వారు.
వైరస్ బారినపడినవారు ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారుగా అధికారులు గుర్తించారు. వీరిందరికీ సాయం అందించేందుకు భారత రాయబార కార్యాలయ అధికారులు ముందుకొచ్చారు.








