డబ్బుల విషయంలో గొడవ.. స్నేహితుడిని పొడిచి చంపిన యువకుడు

- Advertisement -

కాగజ్‌నగర్: లాక్‌డౌన్‌ వేళ పేదలు పడుతున్న ఇబ్బందులతో మనసు కరిగిన ఇద్దరు స్నేహితులు విరాళాలు సేకరించి వారి ఆకలి తీర్చారు.

అయితే, ఇదే వారి మధ్య గొడవకు కారణమై ఆ తర్వాత హత్యకు దారితీసింది. తెలంగాణలోని కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. పదో తరగతి చదువుకున్న విద్యార్థి (16), ప్రవీణ్ (25) స్నేహితులు. లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు పడుతున్న ఇబ్బందులు చూసి చలించి పోయారు.

వీరిద్దరూ కాలనీలోని ఇతర యువకులతో కలిసి చందాలు పోగేసి ఆహారం తయారు చేయించి పంచిపెట్టేవారు. ఇందుకు ఓ కిరాణా దుకాణం యజమాని కూడా సహకరించడంతో రోజుకు 150 ఆహార పొట్లాలు పంపిణీ చేసేవారు.

అయితే, చందాల రూపంలో వసూలైన డబ్బుల విషయంలో శనివారం రాత్రి ఇద్దరు స్నేహితల మధ్య గొడవ మొదలైంది. ఘర్షణ మరింత ముదరడంతో ప్రవీణ్‌పై అందరిముందు పదో తరగతి విద్యార్థి చేయి చేసుకున్నాడు.

అందరి ముందు తనపై చేయి చేసుకోవడంతో తీవ్ర అవమానంగా భావించిన ప్రవీణ్ ఇంటికెళ్లి కత్తి తెచ్చి పదో తరగతి విద్యార్థిపై దాడిచేశాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -