

విశాఖపట్నం: విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కలిసి ఆడుకుందామని చెప్పి బాలికపై విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబర్ 2వ తేదీన జరిగిన ఈ దారుణ ఘటన చాలా అలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం…
ఆదివారం సాయంత్రం విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం కృష్ణాపురం ఎస్సీ కాలనీకి చెందిన ఏడేళ్ల బాలిక కాలనీలో నిర్మాణంలో ఉన్న రామాలయం సమీపంలో ఆడుకుంటోంది. ఆ సమయంలో.. అదే కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆ బాలిక దగ్గరికి వచ్చి మాటలు కలిపారు.
ఆడుకుందామని చెప్పి నమ్మించి…
గుడి దగ్గర కలిసి ఆడుకుందామని చెప్పి నమ్మించి.. ఆ బాలికను ఆలయంలోకి తీసుకెళ్లి ఇద్దరు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిన దారుణాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు విషయాన్ని గ్రామ కులపెద్దల దృష్టికి తీసుకెళ్లగా.. వారు పంచాయతీ పెట్టి, ఇరు పక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నం చేశారు.
కానీ దీనిని బాలిక తల్లి తీవ్రంగా వ్యతిరేకించి.. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పిర్యాదు అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణాపురం ఎస్సీ కాలనీకి చేరుకుని ఈ ఘటనపై విచారించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్కు తరలించారు.
అత్యాచారానికి గురైన బాలిక రెండో తరగతి చదువుతుండగా.. నిందితులైన ఇద్దరు విద్యార్థులు 8, 9 తరగతులు చదువుతుండడం గమనార్హం.








