జగ్గంపేట: ‘‘ప్రధాని నరేంద్రమోడీ అంటే చంద్రబాబు, జగన్‌లకు భయం కానీ.. నాకేం భయం’’ అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగిన ప్రజాపోరాట యాత్రలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… ‘‘ ఆంధ్ర రాష్ట్రంలో అధర్మమైన, అవినీతిమయమైన పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రికి జనసేన అండగా నిలబడదని.. తమ పార్టీ ఎప్పుడు ధర్మం వైపే నిలబడుతుందని వ్యాఖ్యానించారు. 2019లోనూ మీరే రావాలి అంటూ చంద్రబాబు కోసం హోర్డింగులు పెడుతున్నారు.. ఎందుకు రావాలి.. మరింత అవినీతి చేసేందుకా?’’ అని పవన్ ఘటుగా ప్రశ్రించారు.
అవి రెండూ అన్యాయం చేశాయి…
‘‘ఆంధ్రప్రదేశ్‌కి బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి అన్యాయం చేశాయి. 1997లోనే కాకినాడలో బీజేపీ నాయకులు ఒక ఓటు, రెండు రాష్ట్రాలు అనే తీర్మానం చేశారు. ఆ రోజే మన రాష్ట్ర నాయకులు సిగ్గు పడాల్సింది.. నాకు బీజేపీ అంటే చాలా కోపం, విసుగ్గా ఉంది, నేను సొంత అన్నయ్యనే ఎదిరించా.. ఇక మోడీ అంటే నాకు భయం ఎందుకుంటుంది?’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ప్రజలు మార్పును కోరుకుంటున్నారు…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు ఇప్పుడు బలమైన మార్పును కోరుకుంటున్నారని.. ఇక చంద్రబాబు రాజకీయల నుంచి రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. విభజన సమయంలో టీడీపీ ఎంపీలను ఉత్తరాదికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు రక్తం వచ్చేలా కొట్టారని, వారిని కొట్టారనే తెలియగానే తనకే కోపం వచ్చింది.. మరి టీడీపీకి పౌరుషం లేదా, ఇప్పుడు అదే కాంగ్రెస్‌తోనే ఎలా పొత్తు పెట్టుకున్నారని జనసేనాని మండి పడ్డారు.
చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?
ఐటీ దాడుల చేస్తే మన ముఖ్యమంత్రి భయపడుతున్నారని అంటూ.. ఇలాంటి దాడులకు పారిశ్రామికవేత్తలు భయపడాలిగానీ సీఎం ఎందుకు భయపడుతున్నారు… మరి చెప్పుకోలేని రహస్యాలు ఏమైనా ఉన్నాయేమో అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. వంతాడలో అడ్డగోలుగా లాటరైట్ ఖనిజాన్ని తవ్వేస్తున్నారని, మూడు వేల కోట్లు విలువైన ఖనిజాన్ని అక్రమంగా తరలించి ఆంధ్ర రాష్ట్ర ఖజనాకు నష్టం కలిగించారని పవన్ ఆరోపించారు. జనసేన అధికారంలోకి వచ్చాక బాధ్యతతో కూడిన మైనింగ్ విధానాన్ని తీసుకొస్తామని పవన్ పేర్కొన్నారు.