బెంగళూరు: కన్నడ సినీరంగానికి చెందిన ఓ బహుభాషా నటి(30) అత్యాచారానికి గురైంది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది ఓ ప్రైవేటు సంస్థ సీఈవో కావడం గమనార్హం.
అంతేకాదు, ఆమె స్పృహ తప్పి ఉన్న స్థితిలో తీసిన అశ్లీల ఫొటోలు బయటపెడతానంటూ నిందితుడు తరచూ ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఆమె వద్ద నుంచి పలుమార్లు లక్షల్లో డబ్బు గుంజాడు.
అతడి వేధింపులతో విసిగిపోయిన ఆమె నేరుగా పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న సదరు సీఈవో కోసం గాలిస్తున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యశ్వంతపుర జేజే నగర పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో సదరు నటి నివాసం ఉంటోంది. ఆమె ఇప్పటికే పలు కన్నడ, తమిళ సినిమాల్లో నటించింది.
2018లో బసవనగుడి పరిధిలోని గాంధీ బజార్లో మోహిత్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఓ ప్రముఖ కంపెనీకి తాను సీఈవోనంటూ పరిచయం చేసుకున్నాడు.
వారిద్దరి నడుమ సాన్నిహిత్యం పెరిగాక ఆమెను తన సంస్థకు ప్రచార రాయబారిగా నియమించాడు. ఆ క్రమంలో వారు గోవా తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
కొంతకాలం తరువాత తన సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందంటూ నమ్మించి ఆమె వద్ద మోహిత్ కొంత డబ్బు తీసుకున్నాడు.
2019 జూన్ 22న మోహిత్ ఇంట్లో బర్త్‌డే పార్టీలో కూడా ఆ నటి పాల్గొంది. ఆ మర్నాడు ఆమె పుట్టిన రోజు కావడంతో ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు.
ఆ సమయంలో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆమె మత్తులోకి జారుకున్నాక.. ఆమెపై మోహిత్ అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్ తీసి పెట్టి ఆ తరువాత కూడా తరచూ ఆమెను బ్లాక్ మెయిల్ చేసేవాడు.
అలా.. అలా.. ఆమె నుంచి రూ.20 లక్షల వరకు డబ్బు గుంజాడు. అతడి బెదిరింపులు అధికం కావడంతో కనీసం అతడి తల్లిదండ్రులకైనా తన కష్టాన్ని చెప్పుకుంటూ వారైనా కొడుకుని మందలిస్తారని ఆమె భావించింది.
కానీ వారు అతడికే మద్దతుగా నిలిచి ఆమెను బెదిరించారు. దీంతో ఆమె నేరుగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం యావత్తు వెలుగులోకి వచ్చింది.
ఆమెను మోసం చేసిన కేసులో ప్రస్తుతం నిందితుడైన మోహిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు అతడి తండ్రి మహదేవ్, తల్లి నాగవేణి, మరో కుటుంబ సభ్యుడు రాహుల్ వ్యవహారాలపైనా దర్యాప్తు జరుపుతున్నారు.