21.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home క్రైమ్ ఘోరం: తమ్ముడి కూతుర్ని చంపి.. రక్తం తాగిన మేనత్త! మరో ఘటనలో…

ఘోరం: తమ్ముడి కూతుర్ని చంపి.. రక్తం తాగిన మేనత్త! మరో ఘటనలో…

anita murder in vizag
- Advertisement -

blood

విశాఖపట్నం: విశాఖ మన్యంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెదబయలు మండలం లకేయుపుట్టులో కొర్ర అనిత అనే ఆరేళ్ల బాలికను ఆమె మేనత్తే దారుణంగా నరికి చంపింది. ఆ తర్వాత ఆమె ఆ బాలిక రక్తాన్ని కూడా తాగిందని గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు లక్ష్మీపేట పంచాయతీ కప్పాడు గ్రామానికి చెందిన వంతాల రస్మో. ఆమె గత నెల రోజుల నుంచి తమ్ముడి ఇంట్లో ఉంటోంది. నాలుగు రోజుల కిందట తమ్ముడి భార్య ఆమెను ఇంటికి వెళ్లాలని చెప్పింది.

ఈ క్రమంలో తమ్ముడి భార్యపై కోపం పెంచుకున్న రస్మో.. నీ కూతుర్ని చంపుతానని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కట్టెల కోసమని చిన్నారిని కొండపైకి తీసుకెళ్లింది రస్మో. ఆ తర్వాత కత్తితో బలంగా మెడపై నరకడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

గ్రామస్థులు సమాచారం తెలుసుకొని వెళ్లగా.. అప్పటికే బాలిక మృతి చెందింది. దీంతో నిందితురాలిని గ్రామస్థులు పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చిన్నారి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బైక్‌ను ఢీకొన్న లారీ: ముగ్గురు యువకులు మృతి

విశాఖపట్నం జిల్లా ఎస్‌.రాయవరం మండలం అగ్రహారానికి చెందిన కె. వరప్రసాద్‌ (16), కార్తీక్‌ (16,ఆర్‌.నవీన్‌(18) అనే ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై యలమంచిలి వైపు బయలుదేరారు. ఈ క్రమంలో అగ్రహారం చౌరస్తా వద్ద అవతలి వైపు రోడ్డు దాటుతుండగా తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది.

ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, వరప్రసాద్ మృతదేహాన్ని లారీ కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. పులపర్తి గ్రామం వద్ద అతని మృతదేహం లభ్యమైంది. యువకుల మృతితో అగ్రహారం గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఘటనకు బాధ్యుడైన లారీ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

శ్రీశైలంలో మహిళ దారుణ హత్య

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంగాసదన్ వద్ద ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. తలపై కొట్టి హత్య చేశారు. మహిళ మృత దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -