
బెంగళూరు: బెంగళూరులో ఓ దారుణమైన సంఘటన జరిగింది. కేవలం రూ. 10 పార్కింగ్ ఫీజు కోసం…. ఓ వ్యక్తిని చావగొట్టారు. ఇక గట్టి దెబ్బలు తగలడంతో ఆ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని తూర్పు బెంగళూరు భారతీనగర్‌లో ఉన్న లావణ్య థియేటర్ వద్ద చోటుచేసుకుంది.
అసలు ఏం జరిగిందంటే?
భరణీధరణ్ అనే వ్యక్తి తన స్నేహితుడుతో కలిసి బైకుపై లావణ్య థియేటర్‌లో తమిళ సినిమా కాంచనా-3 చూడటానికి వచ్చాడు. ఈ క్రమంలో బైకును థియేటర్ ఆవరణలో పార్కింగ్ చేశాడు.
ఇక వెంటనే అక్కడకు వచ్చిన సెల్వరాజ్… పార్కింగ్ ఫీజు రూ.10 ఇమ్మన్నాడు. అయితే అందుకు భరణిధరణ్ ఒప్పుకోలేదు. ‘ అసలు నీకెందుకివ్వాలి… నీ తొక్కలో రూల్స్ ఎవడిక్కావాలి… అంటూ వెళ్లబోయాడు. దీంతో సెల్వరాజ్ వెంటనే అతన్ని అడ్డుకుని… థియేటర్ బాయ్ శేఖర్‌ని పిలిచాడు.
చదవండి: షాకింగ్: భర్త హత్యకు భార్య సుపారీ! ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే…
శేఖర్, సెల్వరాజ్ ఇద్దరూ కలిసి… భరణిధరణ్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే మాటమాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే శేఖర్, సెల్వరాజ్‌లు భరణిని థియేటర్‌లోకి ఈడ్చుకెళ్లి దొరికిన వస్తువులతో చావబాదారు.
దీంతో భరణికి తగలరాని చోట తీవ్రమైన దెబ్బలు తగిలాయి. అప్పుడు అక్కడ ఉన్న కొందరు వెంటనే వచ్చి… గొడవని ఆపి… భరణిని దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
భరణి చనిపోవడంతో సెల్వరాజ్, శేఖర్‌లు పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఓ మెకానిక్ షెడ్డులో దాక్కున్న సెల్వరాజ్, శేఖర్‌లని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.








