
ఢిల్లీ: మరో 8 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్న సంగతి తెలిసిందే. రేపు ఆరో దశ పోలింగ్…19న ఏడో దశ పోలింగ్‌తో ఎన్నికల ఘట్టానికి తెరపడుతుంది. ఇక మే 23న అందరి భవిష్యత్ బయటపడనుంది.
అయితే 2014 ఎన్నికల్లో మాదిరిగా ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాదనే చర్చ దేశ వ్యాప్తంగా నడుస్తుంది. అలాగే కాంగ్రెస్‌కి బీజేపీ కంటే తక్కువే సీట్లు వస్తాయని అర్ధమవుతుంది. అయితే బీజేపీ మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ చర్చ ఉన్న క్రమంలోనే బీజేపీ మిత్రపక్షం అయిన అకాళీదళ్ నేత నరేష్ గుజ్రాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ దక్కడం కష్టమని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్‌ని దాటిందని, ఈ సారి మాత్రం అన్ని సీట్లు రావని స్పష్టం చేశారు.
చదవండి: యడ్డీ మళ్ళీ మొదలుపెట్టేశారుగా…
బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ సైతం ఈ సారి బీజేపి ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రుల సహకారం అవసరమని అన్నారని ఈ సందర్భంగా గుజ్రాల్ గుర్తుచేశారు. ఇక ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతేనే ఈ సారి ఎన్డీఏకు అవకాశం ఉంటుందని, లేదంటే అధికారానికి దూరమవడం ఖాయమని అన్నారు.








