

ప్రకాశం: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పరువు హత్యల పరంపరం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల ముందు తెలంగాణలోని మిర్యాలగూడలో ప్రణయ్‌ని అత్యంత కిరాతకంగా చంపిన విషయం అందరికి తెలిసిందే. తన కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని కక్ష పెంచుకొని, కిరాయి హంతకులకు డబ్బు ఇచ్చి హత్య చేయించాడు ఓ కిరాతక తండ్రి.
తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరో పరువు హత్య చోటుచేసుకుంది. తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఓ తండ్రి కన్నకూతురిని గొంతు నులిమి చంపేశాడు. తాళ్లూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. దీనిపై తాళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఎస్సీ యువకుడ్ని ప్రేమించినందుకు…
వివరాల్లోకి వెళితే… తాళ్లూరు మండలం కొత్తపల్లికి చెందిన వైష్ణవి ఒంగోలులోని శ్రీ హర్షిణి డిగ్రీ కాలేజీలో చదువుతోంది. తన క్లాస్‌మెట్ అయిన సునీల్‌తో ఆమె ప్రేమలో పడింది. వైష్ణవి, సునీల్ ప్రేమ వ్యవహారం ఇటీవల వైష్ణవి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో కుటుంబసభ్యులు వైష్ణవిని నిలదీశారు.
ఆగ్రహించిన ఆమె తండ్రి కృష్ణారెడ్డి తాను చెప్పిన వ్యక్తినే పెళ్లిచేసుకోవాలంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఆదివారం రాత్రి ఇంట్లో వైష్ణవి, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగినట్టు సమాచారం.
అయితే, ఉదయం లేచేసరికి వైష్ణవి విగతజీవురాలై పడి ఉంది. వైష్ణవిని ఆమె తండ్రి కృష్ణారెడ్డి గొంతు నులిమి హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వైష్ణవి తల్లిదండ్రులను ప్రశ్నించి కేసు నమోదు చేశారు. ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించినందుకు కృష్ణారెడ్డి తన కూతురైన వైష్ణవిని చంపినట్టు తెలుస్తోంది.








