
చెన్నై: అక్క మొగుడే కదాని కాస్త చనువుగా ఉంటే.. అదే అదనుగా మరదలిని అపహరించి, ఓ షాపులో బంధించి, ఆపైన ఆ మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడో బావ ప్రబుద్ధుడు. చివరికి అత్తింటి వారి ఫిర్యాదుతో అతడి నిజస్వరూపం బయటపడగా, అరదండాలు తగిలించారు పోలీసులు. గత నెలలో జరిగిన ఈ దారుణం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే… తిరవళ్లూరు జిల్లాలోని తేర్‌వళి గ్రామానికి చెందిన అజిత్ కుమార్(22)కు అదే ప్రాంతానికి చెందిన యువతితో ఫిబ్రవరి 15న వివాహమైంది. అతడు స్థానికంగా ఓ సెల్‌ఫోన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. కొత్త పెళ్లి కొడుకు కావడంతో అత్తింటి వారు బాగానే మర్యాదలు చేసేవారు. ఈ క్రమంలో అజిత్ కుమార్ కన్ను సొంత మరదలు(14)పై పడింది.
ఫిబ్రవరి 27న కూతురు కనిపించకపోవడంతో అజిత్ కుమార్ అత్తింటి వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈలోగా సొంత మరదలిని కిడ్నాప్ చేసిన అజిత్ కుమార్ ఆమెను ఓ షాపులో బంధించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
షాపులో బంధించి అత్యాచారం…
పోలీసుల విచారణలో బాధితురాలిని చివరిసారిగా తాము ఆమె బావ అయిన అజిత్ కుమార్‌తోనే చూశామంటూ కొంతమంది సాక్షులు చెప్పడంతో పోలీసులకు అతడిపై అనుమానం కలిగింది. దీంతో శనివారం అతడ్ని అదుపులోకి తీసుకున్న వారు తమదైన శైలిలో విచారించేసరికి మొత్తం అంతా కక్కేశాడు.
మరదల్ని బంధించి ఉంచిన ప్రదేశాన్ని కూడా అజిత్ కుమార్ పోలీసులకకు చూపించాడు. దీంతో ఆమెను కాపాడిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అజిత్ కుమార్‌ను అరెస్ట్ చేసి పొన్నేరి కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరికి రిమాండుకు పంపించారు.








