పర్చూరు: ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బంధువునంటూ ఓ మైనర్ బాలికతో ఆమెతో మాట కలిపిన ఓ ప్రబుద్ధుడు అనంతంరం ప్రేమ పేరుతో ఆమెకు మరింత దగ్గరై.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరికి గర్భవతిని చేసి అనంతరం మాయ మాటలు చెప్పి అబార్షన్ కూడా చేయించాడు.
పొలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా పర్చూరు మండలంలోని నూతలపాడు గ్రామానికి చెందిన ఓ బాలిక రెండేళ్ల క్రితం పోతుకట్లలో జరిగిన తిరునాళ్లు చూడడనికి వెళ్లింది. అక్కడ పోతుకట్ల గ్రామానికి చెందిన 23 ఏళ్ల వ్యక్తి ఆమెను కలిశాడు.
బంధువునంటూ పరిచయం చేసుకుని…
ఆమెకు తను బంధువునంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత వారి మధ్య పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ యువకుడు శారీరకంగా కూడా దగ్గరయ్యాడు. ఆ బాలిక అతడి మాటలు నమ్మేసింది.
ఇక ఆ రోజు నుండి ఆమెతో పలుసార్లు అతడు శారీరకంగా కలిశాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలని అతడిని ఒత్తిడి చేయగా సరేనని చెప్పి ఏవో మందులు ఇప్పించి వచ్చిన గర్భం పోయేలా చేశాడు. అనంతరం ఆ బాలికను పెళ్లి చేసుకునేందుకు అతడు నిరాకరించాడు.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ బాలిక డిసెంబర్ 4వ తేదీన పర్చూరు పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె వయసు 18 సంవత్సరాలున్నప్పటికీ 16వ ఏట నుంచే ఆమెపై లైంగికదాడి జరిగినట్లు తేలింది. దీంతో పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.