కొవ్వూరు: ఓ మహిళ సౌదీలో చనిపోగా దాదాపు సంవత్సరం తర్వాత ఆమె మృతదేహం ఇంటికి చేరింది. ఆమె చనిపోయిందన్న విషయం తెలిసిన తర్వాత ఆమె కటుంబ సభ్యులు, బంధువులు మృతదేహం కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 368 రోజులు ఎదురుచూశారు. ఈ దారుణ పరిస్థితి పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కొవ్వూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కేశనకుర్తి పద్మావతి(45) భర్త చనిపోవడంతో స్ధానికంగా అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తూ.. కొడుకు, కుమార్తెను చదివించి.. పెంచి పెద్దచేసింది.
సంపాదన కోసం సౌదీ వెళితే…
ఈ క్రమంలో స్థానిక ఇందిరమ్మ కాలనీలోనే అప్పు చేసి సొంత ఇల్లు కట్టుకుంది. ఆ తరువాత ఇంటి కోసం చేసిన అప్పు భారం అధికమై.. కుటుంబ జీవనం కష్టతరం కావడంతో.. తెలిసిన వారి సలహా మేరకు సంపాదన కోసం 2015 నవంబర్‌లో సౌదీ అరేబియా వెళ్లింది.
ఒప్పందం ప్రకారం ఆమె 2017లో తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2017 నవంబర్ 23వ తేదీన పద్మావతి సౌదీ నుంచి తన సోదరుడికి ఫోన్ చేసింది. సౌదీలో తన ఇంటి యజమాని తనని దారుణంగా కొడుతున్నాడంటూ చెప్పి విలపించింది. తాను డిసెంబర్ 4వ తేదీన బయలుదేరి ఇంటికి వస్తున్నట్లు చెప్పింది.
అంతే.. ఆ తర్వాత ఆమె దగ్గర్నించి ఎలాంటి ఫోన్ లేదు. అయితే.. పద్మావతి సౌదీలోనే చనిపోయిందని.. అక్కడ ఉన్న ఓ వ్యక్తి ద్వారా ఆమె కుటుంబ సభ్యులు తెలుసుకోగలిగారు.
తన తల్లి మృతదేహన్నిఅయినా స్వదేశం చేర్చి తమకు అప్పగించాలంటూ ఆమె కుమారుడు… మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మణిక్యాలరావును ఆశ్రయించాడు. అప్పటి నుంచి ప్రయత్నించగా.. సంవత్సరం తర్వాత పద్మావతి మృతదేహం కొవ్వూరులోని ఇంటికి చేరింది.