24.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home క్రైమ్ అతిపెద్ద ఉగ్రదాడి: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి, 40 మంది జవాన్లు మృతి

అతిపెద్ద ఉగ్రదాడి: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి, 40 మంది జవాన్లు మృతి

terror attack
- Advertisement -

terror attack

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం ఉగ్రవాదులు భారీ ఘాతుకానికి ఒడిగట్టారు.  70 వాహనాల్లో వెళుతున్న సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా చేసుకుని తొలుత తుపాకులతో కాల్పులు జరిపి, అనంతరం ఐఈడీ బాంబులతో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. అవంతిపొరలోని గొరిపొరలో ముందుగా కాల్పులు జరిపి అనంతరం ఐఈడీ బాంబు పేల్చారు. అదిల్ అనే జేషే ఉగ్రవాది ఆత్మాహుతికి పాల్పడ్డాడు.

ఈ ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. 35మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, పేలుడు కారణంగా ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. తెగిపడిన శరీర అవయవాలతో రహదారి రక్తసిక్తమైంది. జమ్మూకాశ్మీర్ ప్రధాన రహదారిపై నిలిపి ఉంచిన ఓ కారులో ఉంచిన 350కేజీల పేలుడు పదార్థాలను(ఐఈడీని) ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్ కాన్వాయ్ అక్కడికి రాగానే ఆ వాహాన్ని ఉగ్రవాదులు పేల్చేశారు. పేలుడు ధాటికి వాహనం ముక్కలు ముక్కలైంది.

దాడి మా పనే: జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ: యూరీ తర్వాత అతిపెద్ద ఘటన

ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది.. హుటాహుటిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఉగ్ర దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్‌ (జేఈఎం) ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. పుల్వామాలోని పాఠశాలలో బాంబు పేలుడు ఘటన జరిగిన 24గంటలు గడవక ముందే ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడటం ఆందోళనకరంగా మారింది. తాజా పేలుడు ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది హైవేపై రాకపోకలను నిషేధించారు.

అమర జవాన్ల కుటుంబాలకు అండగా దేశం: మోడీ

ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతాదళాలు కార్డన్ సెర్చ్ చేపట్టారు. కాగా, 2016లో జరిగిన యూరీ ఉగ్రదాడి ఘటన తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా ఈ దాడి మారింది. ఈ ఉగ్రదాడిపై దర్యాప్తు జరుగుతోందని భద్రతాధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. భారీగా అదనపు బలగాలను మోహరించారు. ఉగ్రదాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరవీరుల త్యాగాలను వృథాగా పోనివ్వమని అన్నారు. అమర జవాన్ల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందని చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఘటనపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌, ఇతర అధికారులతో చర్చించినట్లు తెలిపారు.

దాడిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ,  ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్‌తో పాటు పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.  ‘సీఆర్పీఎఫ్‌ వాహనంపై దాడి ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. ఈ దాడిలో అనేకమంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు.

పాఠశాల వెలుపల బాంబు గుర్తింపు

ఇది ఇలా ఉండగా, ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ప్రమాదకరమైన బాంబును గుర్తించిన సైనిక బలగాలు సురక్షితంగా పేల్చివేశాయి. ఇంఫాల్‌ జిల్లాలోని కాంచిపూర్‌ ప్రాంతంలో ఓ పాఠశాల గేటు వెలుపల ఐఈడీని భద్రతా బలగాలు గుర్తించాయి. వెంటనే విద్యార్థులు, సిబ్బంది, స్థానికులను అక్కడి నుంచి తరలించారు. బాంబు నిర్వీర్య నిపుణులను రంగంలోకి దింపడంతో వారు ఎలాంటి ప్రమాదం జరగకుండా బాంబును అక్కడే పేల్చివేశారు. దీంతో అక్కడ ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం జరగలేదు.

- Advertisement -