

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీకి రోజుకో ఎదురుదెబ్బ తగులుతోంది. ఎన్నికల వేళ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం ఖాయమని సర్వేలు చాటుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనతో విసిగిపోయిన టీడీపీలోని బలమైన నేతలు వైఎస్సార్‌సీపీలోకి వరుసకడుతున్నారు.
టీడీపీకి దెబ్బ మీద దెబ్బ..
విశాఖపట్నంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతకొంతకాలంగా చంద్రబాబు పరిపాలన, టీడీపీ తీరుతో అసంతృప్తితో ఉన్న అవంతి శ్రీనివాస్ గురువారం లోటస్‌పాండ్‌లోని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు.
ఆ తరువాత పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవులు వీడిన తర్వాతే పార్టీలో చేర్చుకుంటామన్న వైఎస్ జగన్ ఉన్నత ఆశయాన్ని గౌరవిస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు.
అనంతరం వైఎస్ జగన్ సమక్షంలో లాంఛనంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఆమంచి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.








