విజయవాడ: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. దేవరపల్లి గగారిన్ అనే ఫైనాన్స్ వ్యాపారిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న గగారిన్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడ బీసెంట్ రోడ్డులోని మూన్‌మూన్ ప్లాజా వద్ద చిలుకూరి దుర్గయ్య వీధిలో ఉన్న రవితేజ ఫైనాన్స్ కార్యాలయంలోనే గగారిన్‌పై ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన రవితేజ ఫైనాన్స్ కార్యాలయం నుండి బయటకు పరుగెత్తుకు వచ్చాడు. ఆర్థికపరమైన అంశాల్లో విబేధాల కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
90 శాతం ఒళ్లు కాలిపోయింది.. పరిస్థితి విషమం…
ఈ ఘటనలో గగారిన్ ఒళ్లు 90 శాతం కాలిపోయిందని, 48 గంటలు గడిస్తేగాని ఏమీ చెప్పలేమని ఆయనకు చికిత్స అందిస్తోన్న డాక్టర్ రామారావు తెలిపారు. ఉదరభాగం నుంచి కిందికి ఎక్కువ శాతం శరీరం కాలిందన్నారు. ప్రస్తుతం గగారిన్ పరిస్థితి విషమంగా ఉంది.
తనపై పెట్రోలు పోసి అంటించింది మాదాల సురేశ్, మాదాల సుధాకర్ అని గగారిన్ చెప్పినట్టు తెలుస్తోంది. అ ఇద్దరు వ్యక్తులతో గగారిన్‌కు విబేధాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే వీరిద్దరే గగారిన్‌పై దాడికి పాల్పడ్డారా?… ఇంకా ఎవరైనా చేశారా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ క్యాన్‌తో ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ దాడికి పాల్పడిన తర్వాత ఎక్కడికి వెళ్లారనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ నార్త్ ఏసీపీ రమణ మూర్తి చెప్పారు.
‘‘ఇద్దరు వ్యక్తులు గగారిన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు.. స్థానికులు స్పందించి వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రాణం పోతోంది కాపాడమని, ఆస్పత్రికి తీసుకెళ్లమని అక్కడ ఉన్నవారిని గగారిన్ దీనంగా అడిగాడు. దీంతో వారు అతడ్ని ఆటోలో ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించారు..’’ అని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
చదవండి: షాకింగ్: భర్తపై కోపంతో తన ఇంట్లోనే చోరీ చేయించిన భార్య, పోలీసులు కనిపెట్టేయడంతో మళ్లీ నాటకం…
చదవండి: షాకింగ్: ప్రియుడ్ని చంపి.. కూర వండి.. కూలీలకు వడ్డించిన యువతి!