ఒక చేత చెప్పులు.. మరో చేత రాజీనామా: స్వతంత్ర అభ్యర్థి ఆకుల హన్మంతు వెరైటీ ప్రచారం

korutla independent candidate-akula hanumanthu variety campaign
- Advertisement -

korutla independent candidate-akula hanumanthu variety campaign

జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచార హోరు జోరు అందుకుంది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాకు చెందిన ఓ స్వతంత్ర అభ్యర్థి నియోజకవర్గంలోని ఇంటింటికి వెళ్లి  చెప్పులు పంచుతూ.. వెరైటీ ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజవర్గం నుంచి ఆకుల హన్మంతు అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మంతు ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాల్సిందిగా ఓటర్లకు విన్నవించుకుంటున్నారు.

‘‘మాట తప్పితే చెప్పు తీసుకొని కొట్టండి…’’

తను ఎన్నికల్లో విజయం సాధిస్తే తాను ఇచ్చిన హామీలన్నింటిని తప్పక నెరవేరుస్తానన్నారు. ఒకవేళ తాను మాట తప్పితే పబ్లిక్‌గా తనను చెప్పు తీసుకుని కొట్టండంటూ ఓటర్లకు చెప్పులను కూడా పంచుతున్నారు. హామీలను నెరవేర్చకపోతే తనను పదవి నుంచి తొలగించవచ్చంటూ.. ముందే సిద్ధం చేసి పెట్టుకున్న రాజీనామా పత్రాన్ని కూడా ప్రజలకు చూపిస్తున్నారు.

ఈ విషయం గురించి హన్మంతు మాట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను ఇలా వెరైటి ప్రచారం చేస్తున్నానని తెలిపారు. మరోవైపు  కోరుట్ల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు పోటీ చేస్తున్నారు.

ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించిన విద్యాసాగర్‌ రావు వరుసగా నాలుగోసారి కూడా విజయం సాధించాలని ఉవ్విళూరుతుండగా.. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మీద విజయం సాధించాలని స్వతంత్ర అభ్యర్థి హన్మంతు నిర్విరామ కృషి సలుపుతున్నారు.

- Advertisement -