పశ్చిమ గోదావరి: ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఎవరైనా ఫోన్ చేసి.. మీకు లాటరీ తగిలిందని, లాటరీలో వచ్చిన డబ్బును పొందడానికి రూ.1.30 కోట్లు కట్టాలని చెబితే ఎవరైనా నమ్ముతారా? ఎవరూ నమ్మరు.. కానీ నరసింహారావు అనే వ్యక్తి మాత్రం గుడ్డిగా నమ్మేశాడు.. ఆపైన మోసపోయానని అర్థమై లబోదిబోమన్నాడు!
విషయం ఏమిటంటే.. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం గుడిపాడుకు చెందిన మోరు నరసింహారావు అనే వ్యక్తికి ఈ ఏడాది జూలై 21న ఒక ఫోన్ కాల్ వచ్చింది. ‘‘నాప్టోల్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం.. మా కంపెనీ డ్రాలో మీరు టాటా సఫారీ కారు గెలుచుకున్నారు. అంతేకాదు, మీరు చేసిన షాపింగ్‌కు సంబంధించిన డ్రాలో కూడా మీ ఫోన్ నంబర్‌కు రూ.1.77 కోట్ల లాటరీ తగిలింది. వాటికి సంబంధించి ఆర్‌బీఐ స్టాంపు వేసిన 100 రూపాయల బాండ్ పేపర్లు మాకు వచ్చాయి. టాక్స్ కట్టేసి ఈ రెండు బహుమతులు తీసుకువెళ్ళండి…’’ అంటూ ఆ ఫోన్ చేసిన వ్యక్తులు చెప్పారు.
నమ్మేశాడు.. ముంచేశారు…
దీంతో తనకు నిజంగానే లాటరీ తగిలిందని నమ్మిన నరసింహారావు ముందుగా వాళ్లు చెప్పినట్లుగా రూ.25 వేలు వాళ్లు చెప్పిన బ్యాంకు అకౌంట్‌లో వేశాడు. దీంతో నరసింహారావు తమ మాటలు నమ్మాడని నిర్ధారించుకున్న అవతలి వ్యక్తులు అది మొదలుకొని అనేక రకాల టాక్స్‌ల పేర్లు చెప్పి వాళ్ల ఖాతాలో వేలు, లక్షలు వేయించుకున్నారు. అ డబ్బు ఎంతో తెలుసా? అక్షరాలా ఒక కోటి 30 లక్షల 48 వేల 863 రూపాయలు.
అంత డబ్బు ఆన్‌లైన్‌లో చెల్లించాక ఇంకా వాళ్లు చెప్పిన బహమతులు ఇవ్వకపోవడంతో నరసింహారావు వారిని నిలదీయడం మొదలెట్టాడు. దీంతో అవతలి వ్యక్తులు వాళ్ల మెబైల్ ఫోన్ కూడా స్విఛ్చాఫ్ చేసేశారు. అప్పటికిగాని అర్థం కాలేదు నరసింహారావుకు.. తానెంత దారుణంగా మోసపోయింది. ఇక ఆ తర్వాత ఏముంది.. ఆదివారం పెదపాడు పోలీసుస్టేషన్‌కు వెళ్లి అక్కడి అధికారులకు మొరపెట్టుకున్నాడు.