రైలు ప్రయాణికుల కోసం.. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఫీచర్‌.. ‘ఆస్క్‌ దిశ’

IRCTC_Ask_Disha
- Advertisement -

irctc ask-disha

హైదరాబాద్‌: రైళ్ల రాకపోకలు, టికెట్ల రద్దు, కావాల్సిన రైలు ప్రస్తుతం ఎక్కడుంది.. ఇలాంటి మీకు కావల్సిన వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా..! అయితే మీ కోసం ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఒక ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ  ప్రత్యేక ఫీచరే ‘ఆస్క్‌ దిశ’.

ఏదైనా అడిగిన వెంటనే సమాధానం చెప్పేలా ఉండాలనే ఉద్దేశంతో ‘ఆస్క్‌ దిశ’  పేరుతో ప్రత్యేక ఫీచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఫీచర్‌‌లో కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.  అంతేకాదు, టికెట్లను సులువుగా బుక్‌ చేసుకునే అవకాశంతో పాటు ఈ ఫీచర్ ద్వారా ఇంకా వివిధ రకాల సౌకర్యాలు కూడా పొందవచ్చు. బెంగళూరుకు చెందిన ఐటీ సంస్థ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సాంకేతికతతో ఈ ఫీచర్‌ను రూపొందించింది.

ఐఆర్‌సీటీసీ ప్రారంభించిన ‘ఆస్క్‌ దిశ’ ఫీచర్‌ 24 గంటలపాటు సేవలందించనుంది. ప్రయాణికులు ఏ సమయంలోనైనా ఈ సౌకర్యాన్ని పొందేలా చర్యలు తీసుకుంది. త్వరలోనే దీనిని ఆండ్రాయిడ్‌ యాప్‌గా కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

గూగుల్‌లో ‘ఐఆర్‌సీటీసీ డాట్‌ కామ్‌’ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసిన వెంటనే కుడివైపున కిందగా ఈ ‘ఆస్క్‌ దిశ’ లోగో కనిపిస్తుంది. దీనిని ఓపెన్‌ చేసి అందులో తమకు కావాల్సిన రైళ్ల రాకపోకలకు సంబంధించిన ప్రశ్నలను టైప్‌ చేస్తే వెంటనే సమాధానాలు కూడా వస్తాయి. అంతేకాకుండా సదరు రైలు ఎక్కడుందో, టికెట్‌ను ఎలా రద్దు  చేసుకోవాలనే వివరాలను తెలియజేస్తుంది.

తెలుగుతోపాటు అన్ని భారతీయ భాషల్లో అడిగే ప్రశ్నలకు దీని ద్వారా సమాధానం  పొందవచ్చు. అలాగే వాయిస్‌ ద్వారా కూడా సమాధానాలు ఇస్తుంది.  ఐఆర్‌సీటీసీ గత శనివారం ప్రారంభించిన ఈ ఫీచర్‌కు విశేష స్పందన లభిస్తోంది.

- Advertisement -