‘హిట్’తో దోమలను చంపాను.. లెక్క పెట్టాలా?: ప్రతిపక్షాలకు వీకే సింగ్ చురకలు

- Advertisement -

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్‌‌ ఉగ్రస్థావరాలపై జరిగిన దాడిలో ఎంత మంది చనిపోయారన్న అంశంపై వివాదం నడుస్తోన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వీకే సింగ్‌ ప్రతిపక్షాలకు పరోక్షంగా చురకలంటించారు. దోమల్ని చంపేస్తే లెక్కబెట్టుకుంటూ కూర్చోవాలా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.

చనిపోయిన దోమలను లెక్కపెట్టాలా? లేక వెళ్లి పడుకోవాలా?

ట్విట్టర్‌ వేదికగా విపక్షాలపై బుధవారం ఆయన విరుచుకుపడ్డారు.‘నిన్న రాత్రి 3.30గంటల సమయంలో నా గదిలో విపరీతంగా దోమల బెడద ఉంది. వాటి నివారణకు నేను ‘హిట్‌’ను వాడాను. ఇప్పుడు నేను అవి ఎన్ని చనిపోయాయని లెక్కబెట్టాలా?..లేక వెళ్లి నిద్రపోవాలా?’’ అని వైమానిక దాడులను ఉద్దేశిస్తూ వీకే సింగ్ వ్యాఖ్యానించారు.

పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారన్న దానిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనిపై ఆధారాలు చూపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ క్రమంలో స్పందించిన హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడో.. రేపో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని మంగళవారం వ్యాఖ్యానించారు. అలాగే ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారన్న విజయ్‌ గోఖలే ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. తాము ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని, అదే తమ లక్ష్యమని, కానీ, ఎంతమంది చనిపోయారని శవాలను లెక్కించడం తమ పని కాదని ఎయిర్ చీఫ్ కూడా ఇటీవలే వ్యాఖ్యానించారు.

చదవండి: పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదు.. యాక్సిడెంట్: డిగ్గీ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -