టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ మేనకోడలు!

2:40 pm, Wed, 6 March 19
ram-gopal-shravya

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ఈ పేరుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ డమ్ ఉంది. సినీ ఇండస్ట్రీలో వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ మన రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన ఎన్టీ రామారావు జీవితంలోని వివాదాస్పద కోణాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించబోతున్నారు.

ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం  తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, చివరి నిమిషంలో ఆయన ఎదుర్కొన్న మానసిక క్షోభ, వెన్నుపోటు పర్వం లాంటి కీలక అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

ఈ చిత్రం మార్చి 22న విడుదలవుతున్న నేపథ్యంలో తన ట్విట్టర్ పేజీ ద్వారా కొన్ని రోజులుగా సినిమాను ప్రమోట్ చేస్తూ బీజీగా గడుపుతున్నారు వర్మ.

ఆశ్చర్యపోతున్న వర్మ అభిమానులు…

ఈ మూవీ ద్వారా వర్మ తన మేనకోడలు శ్రావ్య వర్మను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. వర్మ తన మేనకోడలితో కలిసి దిగిన ఫోటోలు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా వర్మ ఆమె కాస్ట్యూమ్ డిజైనింగ్ టాలెంట్ గురించి ఆయన తెగ ప్రశంసించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి శ్రావ్యవర్మ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది.

శ్రావ్యా వర్మతో కండలు ప్రదర్శించే విషయంలో పోటీ పడి, ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ వర్మ మరో ఫోటో షేర్ చేశారు. సాధారణంగా వర్మ నుంచి ఎప్పుడూ ఇలాంటి సరదా పోస్టులు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన పోస్టులు అసలు కనిపించవు. ఊహించని విధంగా ఇలాంటివి దర్శన మివ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వివరాల్లోకి వెళితే… ఎన్టీ రామారావు పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. రామారావు చివరి రోజుల్లో చోటు చేసుకున్న వివాదాస్పద అంశాలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం ఉండబోతుంది.

చదవండి: హ్యాపీ బర్త్ డే శర్వా! బియర్డ్ ఫస్ట్ లుక్!