రాజీవ్ కనకాల, సుమ.. గ్రేట్ కపుల్! గుండెల్లో కొండంత దు:ఖం ఉన్నా…

6:40 pm, Fri, 9 August 19
anchor-suma-rajeev-kanakala

హైదరాబాద్: వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉన్నవారు కచ్చితంగా విజయం సాధిస్తారు. అలా నిబద్ధతతో విజయ శిఖరాలు అధిరోహించిన వారు ఎందరో. అయితే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎంతటి కష్టం వచ్చినా ఆ నిబద్ధతను నిలుపుకునే వారు మాత్రం అరుదుగానే ఉంటారు. 

వ్యక్తిగత జీవితంలో అలాంటి పరిస్థితే భార్యాభర్తలు, నటుడు రాజీవ్ కనకాల-యాంకర్ సుమకు ఎదురైంది. ఇటీవలే రాజీవ్ కనకాల తండ్రి, నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల మరణించారు. యాంకర్ సుమ ఆయన కోడలే. రాజీవ్, సుమ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉంటారు. 

తిరిగి మూడు రోజుల్లోనే…

ఉన్నట్లుండి ఇంట్లో విషాదం చోటుచేసుకోగా.. దేవదాస్ కనకాల అంత్యక్రియలు పూర్తి చేసి తిరిగి మూడు రోజుల్లోనే వృత్తిగత జీవితంలోకి తిరిగి ప్రవేశించారు. గుండెల్లో కొండంత దు:ఖం పెట్టుకుని కూడా వారి వృత్తిగత జీవితంలో ఎంతో నిబద్ధతతో వ్యవహరించడం వారిని గ్రేట్ కపుల్‌గా నిలుపుతోంది. 

ఒకప్పుడు ప్రముఖ క్రికెటర్ సచిన్‌కి కూడా జీవితంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది.  తన తండ్రి మరణించిన మరుసటి రోజే టీమిండియా కోసం సచిన్ మైదానంలోకి దిగి ఆడాడు. ఈ మధ్య ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తమ తండ్రి హరికృష్ణ మరణంతో తీవ్ర వ్యథకు లోనయ్యారు కానీ వారు తమ వృత్తిని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు.

తండ్రి పోయాడనే బాధ ఉన్నప్పటికీ అంత్యక్రియలు పూర్తి చేసి ఎప్పటిలానే వారు షూటింగ్‌లో పాల్గొన్నారు. అంతేకాదు, అలాంటి కమిట్‌మెంట్‌ను తాము తమ తండ్రి నుంచే నేర్చుకున్నామని గొప్పగా చెప్పుకున్నారు. నిజానికి రాజీవ్ కనకాల, సుమ ఇంకొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నా పోయేదేమీ ఉండదు. 

కానీ తమ కారణంగా ఇతరులు ఇబ్బంది పడకూడదనే ఒక నిబద్ధతతో వారు ఇప్పటికే కమిట్ అయిన షోలను, ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇలా వృత్తికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు సమాజంలో ఎంతో అరుదుగా కనిపిస్తారు.