హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీలో విప్లవ కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఒరవడి సృష్టించుకున్న నటుడు ఆర్. నారాయణమూర్తి. తాజాగా, అందాలతార, అతిలోకసుందరి శ్రీదేవిపై ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో వచ్చి ఫిర్యాదు చేస్తే సినిమా ఆపేస్తారా? అంటూ మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తే.. ఎవరో, ఏదో ఫిర్యాదు చేశారని చెప్పి సినిమాను నిలిపివేయడం దారుణమని అన్నారు. ప్రతి దానికీ అమరావతి వెళ్లి వివరణ ఇవ్వాలా? అని ప్రశ్నించారు.
శ్రీదేవి బతికుంటే కన్నీళ్లు పెట్టుకునేది…
నేడు శ్రీదేవి బతికుంటే సెన్సార్ బోర్డు తీరును చూసి కంటతడి పెట్టుకుని ఉండేదని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. గతంలో తన సినిమాకు సెన్సార్ బోర్డుతో ఇబ్బందులు ఎదురైనప్పుడు సహాయం చేసిందని చెబుతూ ఆయన దివంగత నటి శ్రీదేవిని గుర్తుచేసుకున్నారు.
ఆ రోజుల్లో తాను విప్లవ సినిమాలు తీస్తుంటే శ్రీదేవి ఎంతో ఆశ్చర్యపోయేవారని, తనకు కూడా విప్లవ పంథా సినిమాలు తీయాలని ఉందని తనతో ఆమె చెప్పారని నారాయణమూర్తి వెల్లడించారు.








