
అమరావతి: గతంలో వైసీపీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీలో చేరిన ఆ పార్టీ నేతలు కొందరు మళ్లీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇప్పటికే టీడీపీ నుంచి మళ్లీ వైసీపీలో రాగా… తాజాగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి కూడా మళ్లీ వైసీపీ గూటికి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
తన సిట్టింగ్ స్థానమైన కర్నూలు ఎమ్మెల్యే సీటును తనకు కాకుండా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్‌కు కేటాయించడంపై ఎస్వీ మోహన్ రెడ్డి రగిలిపోతున్నారు. ఇంకా టీడీపీలో ఉండటం అనవసరమని ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తుండటంతో… త్వరలోనే ఆయన మళ్లీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీలో చేరితే టీడీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చని జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్‌తో పాటు జిల్లాలోని మరో మూడు నియోజకవర్గాల్లో ఆయనకు అనుచరగణం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఆయన వైసీపీలోకి వెళితే ఆయన అనుచరులు కూడా వైసీపీలోకి వెళతారని అది టీడీపీకి మైనస్‌గా మారుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఎస్పీ మోహన్ రెడ్డికి ఎన్నికల తరువాత మరో రకంగా అవకాశం కల్పిస్తామని టీడీపీ ముఖ్యనేతలు హామీ ఇచ్చినా ఆయన మాత్రం తిరిగి వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని… ఆ పార్టీ ముఖ్యనేతలు కూడా ఇప్పటికే మోహన్ రెడ్డితో చర్చలు జరిపారని తెలుస్తోంది. మొత్తానికి కర్నూలు ఎమ్మెల్యే మళ్లీ వైసీపీలోకి వెళితే… జిల్లాలో సత్తా చాటాలని భావిస్తున్న టీడీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.








