
హైదరాబాద్: దక్షిణాది చిత్రసీమను వరుస ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొన్నటివరకు స్టార్ హీరోలు గాయపడటంతో ఆందోళన చెందిన అభిమానులు, తాజాగా క్రేజీ కథానాయిక రష్మిక మందన్న షూటింగ్‌లో తీవ్రంగా గాయపడటంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.
రవీంద్ర పుల్లె దర్శకత్వంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ చిత్రంలో రష్మిక గోండు తెగ మహిళగా నటిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఎంతో సాహసోపేతమైన అండర్ వాటర్ సీన్లు, రిస్కీ యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసేశారు. అయితే, అనుకోకుండా ఓ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఆమె తుంటి భాగానికి బలమైన దెబ్బ తగలడంతో, వైద్యులు ఆమెను పరీక్షించి దాదాపు ఆరు వారాల పాటు (నెలన్నర) పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని కఠినంగా సూచించారు.
మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న భారీ చిత్రం ‘రణబాలి’ సెప్టెంబరు 11న విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు రష్మిక గాయపడటంతో ఈ షూటింగ్‌లకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశం ఉంది.
టాలీవుడ్‌ను వెంటాడుతున్న ‘గాయాల’ శాపం!
ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు అసలు కలసిరావడం లేదు. ఒకరి తర్వాత ఒకరు టాప్ స్టార్స్ గాయాల పాలవుతుండటంతో పరిశ్రమలో ఒకవిధమైన దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
-
నందమూరి బాలకృష్ణ:
#NBK111షూటింగ్ సమయంలో గాయపడటంతో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. -
జూనియర్ ఎన్టీఆర్: ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ షూట్ టైమ్‌లో యంగ్ టైగర్ భుజానికి తీవ్ర గాయమైంది. ఆయన పూర్తిగా కోలుకోవడానికి 6 నుండి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు.
-
రామ్ చరణ్: ‘పెద్ది’ షూటింగ్‌లో చరణ్ మణికట్టుకు గాయమవ్వడంతో, ఇటీవల కోయంబత్తూరు వెళ్లి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.
-
మెగాస్టార్ చిరంజీవి: ఫిబ్రవరిలో చిరంజీవి చేతికి బెల్ట్‌తో కనిపించి అభిమానులను కలవరపెట్టారు.
-
పవన్ కళ్యాణ్: సుదీర్ఘకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలో ఆపరేషన్ చేయించుకున్నారు.
ఇలా అరడజను మంది అగ్ర తారలు వరుసగా గాయపడటంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. రష్మికతో పాటు గాయపడిన తారలంతా త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.








