
అమరావతి: కర్నూలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన 15 మంది అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు.
చిప్పగిరి మండలం నేమకల్లుకు చెందిన టీడీపీ కార్యకర్త గురునాథ్, సంగాల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త గిరి మధ్య ఫోన్‌లో వ్యక్తిగత వివాదం మొదలైంది. ఒకరినొకరు దూషించుకోవడంతో ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ఈ విషయాన్ని గిరి వెంటనే ఎమ్మెల్యే విరూపాక్షి దృష్టికి తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి తన అనుచరులతో కలిసి శనివారం రాత్రి నేమకల్లు గ్రామానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉన్న టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, పరస్పరం రాళ్లదాడికి దారితీసింది.
ఈ రాళ్లదాడిలో టీడీపీ కార్యకర్త శేఖర్ తలకు తీవ్ర గాయమవ్వగా, నాగరాజు అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు ఎడమచేతికి గాయమైంది.
బాధితుడు శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చిప్పగిరి పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 15 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అనంతరం ఆయనను చిప్పగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు.








