షాకింగ్: సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాంకు ఖాతాలు సీజ్, ఎందుకంటే…

mahesh-babu-tax-case
- Advertisement -

mahesh-babu-tax-case

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను జీఎస్టీ కమిషనరేట్ సీజ్ చేయడం సంచలన వార్తగా మారింది. 2007-08 సంవత్సరానికి సంబంధించి సర్వీస్ ట్యాక్స్ చెల్లింపు విషయంలో సూపర్ స్టార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ విషయమై జీఎస్టీ కమిషనర్ ఇప్పటికే పలుమార్లు నోటీసులు పంపించినా మహేష్ బాబు స్పందించలేదని, దీంతో తాజాగా ఇలాంటి చర్య తీసుకోవలసి వచ్చిందని చెబుతున్నారు. మహేష్ బాబుకు చెందిన యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన అధికారులు, యాక్సిస్ బ్యాంకు ఖాతా నుంచి రూ.43 లక్షలు స్వాధీనం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రకటనల ద్వారా భారీగానే ఆదాయం…

మహేష్ బాబు చాలాకాలంగా టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతున్నారు. పలు కార్పొరేట్ ఉత్పత్తులకు సైతం ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రకటనల ద్వారా ఆయన భారీగానే ఆదాయం ఆర్జిస్తున్నారు. 2007-08 సంవత్సరంలో ఇలా వివిధ కార్పొరేట్ ఎండార్స్‌మెంట్స్‌ ద్వారా ఆర్జించిన ఆదాయానికి సంబంధించి రూ.18.05 లక్షలు సర్వీస్ ట్యాక్స్ మహేష్‌బాబు చెల్లించలేదనేది జీఎస్టీ కమిషనరేట్ ఆరోపణ.

అప్పట్నించి.. 2018 వరకు వడ్డీ, పెనాల్టీ అన్నీ కలిపి మహేష్ బాబు చెల్లించాల్సిన మొత్తం రూ. 73 లక్షలకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా పలుమార్లు ఆయనకు నోటీసులు కూడా పంపామని, స్పందన లేకపోవడంతో చివరికి మహేష్‌బాబు బ్యాంకు ఖాతాలు సీజ్ చేయాలని నిర్ణయించామని అధికారులు చెబుతున్నారు.

నిజానికి జీఎస్టీ అమలులోకి వచ్చాక పలు ట్యాక్స్ రేట్లు మారాయి. కానీ కళాకారుల విషయంలో మాత్రం పాత శ్లాబులనే కొనసాగించారు. రూ.1,50,000 లోపు ఆదాయం ఉన్న వారికి జీఎస్టీలో మినహాయింపు ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -