

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన చట్టబద్ధ తీర్మానాన్ని శుక్రవారం లోక్‌సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని 356 ఆర్టికల్ ప్రకారం జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ డిసెంబర్ 19న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జారీ చేసిన ఆదేశానికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. మరోవైపు కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధింపుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది.
కశ్మీర్‌లో ప్రమాదకర వేర్పాటువాద ఉద్యమం సాగుతోందని, అందువల్లే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి పాలన తర్వాత కూడా కశ్మీర్‌లో ప్రజలు సంతోషంగానే ఉన్నారని, కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించలేమని తామెప్పుడూ చెప్పలేదని, పద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని కూడా మంత్రి చెప్పారు. అంతేకాదు, కిచెన్‌లో కూర్చుని నిర్ణయాలు తీసుకోలేమంటూ ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.
కాంగ్రెస్‌కు మెజారిటీ లేదు కాబట్టే…
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ.. చర్చలు, సంప్రదింపులే ప్రజాస్వామ్యానికి పునాది అని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో కాంగ్రెస్‌కు మెజారిటీ లేదు కాబట్టే అక్కడ రాష్ట్రపతి పాలన విధించామని అన్నారు. అయితే రాజ్‌నాథ్ వ్యాఖ్యలను కశ్మీర్ ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లా వ్యతిరేకించారు.
కశ్మీర్‌పై ఆ రాష్ట్ర గవర్నర్ పూర్తి రిపోర్ట్ ఇచ్చారని, ఎవరికీ మెజారిటీ లేదని ఆయన చెప్పారన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు కనుకనే గవర్నర్ తన ప్రతిపాదనలను రాష్ట్రపతికి చేరవేశారన్నారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం లేదని, కూటమిని నిలిపేందుకు చాలావరకు ప్రయత్నాలు చేశామంటూ ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.
ఉగ్రవాదాన్ని అలా అణిచివేయలేం…
కశ్మీర్‌లో ఉగ్రవాదం ఉందన్న విషయాన్ని తాను కాదనడం లేదని, అయితే కేవలం మిలిటరీ బలంతో ఉగ్రవాదాన్ని అణిచివేయలేమని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్ వేర్పాటువాదులు హురియత్ సభ్యులతో హోంమంత్రి రాజ్‌నాథ్ మాట్లాడలేదని ఆయన ఆరోపించారు.
అంతేకాదు, కశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, కశ్మీర్ అంతటా విద్యుత్తు సరఫరా లేదని, మొదట సాధారణ పౌరుల కాల్చివేతను ఆపేయాలని ఆయన సూచించారు.
నినాదాలతో దద్దరిల్లిన లోక్‌సభ…
కశ్మీర్ సమస్య ఇప్పటిదికాదని, అది ఎన్నో తరాలుగా సమస్యగానే ఉందని, తాను రెండుసార్లు అఖిలపక్ష నేతలతో సమావేశానికి కశ్మీర్‌కు వెళ్లానని, సమస్య పరిష్కారానికి ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడవచ్చని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన మాట్లాడుతున్నంత సేపూ ప్రతిపక్షాలు తమ నినాదాలతో సభను హోరెత్తించాయి. కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశాయి.








