జగన్ కోసమే హైకోర్టు విభజన: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

chandrababu-naidu
- Advertisement -

chandrababu-naidu

అమరావతి: ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కేసులను దృష్టిలో ఉంచుకునే హడావిడిగా హైకోర్టు విభజన చేసినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు విభజనతో ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారంటూ పేర్కొన్నారు.

శుక్రవారం ఆరో శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కేంద్రం హైకోర్టు విభజన చేసిందంటూ దుయ్యబట్టారు. ఒకరికి మేలు చేయడం కోసం వంద మందిని ఇబ్బంది పెట్టాలా? అని ప్రశ్నించారు.

హైకోర్టు విభజన కారణంగా ఉద్యోగులు ఇబ్బంది పడతారని, ఐదు రోజుల్లో అమరావతికి రావాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు. కేంద్రం మరికొంత సమయం ఇచ్చి ఉంటే ఉద్యోగులు మారడానికి కూడా ఇబ్బంది ఉండేది కాదన్నారు.

అసలు జగన్ మోహన్ రెడ్డి కేసులను దృష్టిలో ఉంచుకునే హైకోర్టును విభజించినట్లుగా అనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనతో నాంపల్లి సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని, అంతేకాకుండా.. ఆ కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని తెలిపారు.

జగన్ మోహన్ రెడ్డి కేసులో వాదనలు జరగకపోయినా.. న్యాయ ప్రక్రియ ముగిసిందని, అన్ని కోర్టుల్లో కేసులు ఒక కొలిక్కి వచ్చాయని, అయితే హైకోర్టు విభజన వల్ల ఇప్పుడు మళ్లీ అన్నీ మొదటికి వస్తాయని, మరి హైకోర్టు విభజన వల్ల ఎవరికి మేలు కలుగుతుందో ప్రజలు ఆలోచించాలని అన్నారు.

ట్రయల్స్ తర్వాత రద్దు చేస్తారా?

విశాఖ ఉత్సవ్‌లో భాగంగా నిర్వహించతలపెట్టిన ఎయిర్ షోకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అసలు ఏపీని దేశంలో భాగంగా కేంద్రం చూడడం లేదంటూ దుయ్యబట్టారు. ఎయిర్ షో నిర్వహించకుండా అడ్డుపడ్డారని, ట్రయల్స్ నిర్వహించిన తరువాత ఎయర్ షోను రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

- Advertisement -