లక్కీ గై: ఏడాదిపాటు ఫ్రీగా కేఎఫ్‌సీ చికెన్ తినేశాడు! తర్వాత ఏమైందో తెలుసా?

kfc-chicken
- Advertisement -

కేప్‌టౌన్: జస్ట్ 27 ఏళ్ల విద్యార్థి.. కేఎఫ్‌సీ ఔట్‌లెట్ల నిర్వాహకులను తన మాటల చాతుర్యంతో బురిడీ కొట్టించేసి ఫ్రీగా కడుపారా చికెన్ తినేశాడు, అదీ ఏదో ఒక్కసారో, రెండుసార్లో కాదు.. ఏకంగా ఓ ఏడాదిపాటు.

పైగా ఒకే ఔట్ లెట్‌లో కూడా కాదు.. ఎక్కడ వీలైతే అక్కడ. ఎవరూ పసిగట్టలేకపోయారు. తీరా అతడు చేస్తున్న మోసాన్ని గ్రహించిన తరువాత మాత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ విద్యార్థిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఉదంతాన్ని కెన్యాకు చెందిన ఓ జర్నలిస్టు ట్వీట్ ద్వారా వెలుగులోకి తీసుకురావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. 39 వేల మంది లైకులు కొట్టేశారు. 17,439సార్లు రీట్వీట్ చేశారు.

తిట్టడం మాని పొగుడుతున్న నెటిజన్లు…

కొంతమంది అయితే ఆ విద్యార్థిని తప్పుబట్టడం మానేసి కేఎఫ్‌సీ ఔట్‌లెట్ నిర్వాహకులనే తప్పుబడుతున్నారు. ఒకరోజు కాదు, ఒక నెల కాదు.. ఏడాదిపాటు అతడు మోసం చేస్తోంటే వాళ్లెందుకు గ్రహించలేకపోయారు, అసలు లోపం వారిలో ఉంది అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఇక మరికొంతమంది నెటిజన్లయితే.. ఆ విద్యార్థిని పొగిడేస్తున్నారు.. అతడిని ఒక లెజెండ్‌గా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే…

దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్ విశ్వవిద్యాలయ విద్యార్థి (27) కేఎఫ్‌సీ ఔట్‌లెట్స్‌కి వెళ్లేవాడు. తాను కేఎఫ్‌సీ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చానని, మీ ఔట్ లెట్‌లో స్టాండర్స్ ఎలా ఉన్నాయో, చికెన్ టేస్ట్ ఎలా ఉందో తనిఖీ చేయమని చెప్పి తనను పంపించారని చెప్పేవాడు. అంతే.. ఆ మాటలు వినగానే వాళ్లు అతడి బుట్టలో పడిపోయేవారు.

వెనకా ముందూ ఆలోచించేవారు కాదు. కనీసం అతడి ఐడెంటిటీ కార్డు కూడా చూపించమని అడిగేవారు కాదు. అతడేం తింటానంటే అది అందించి.. రుచి ఎలా ఉంది అని అడిగి.. అతడు గుడ్ అనగానే తెగ సంతృప్తి పడిపోయేవారు.

ఇలా ఆ విద్యార్థి ఒక రోజు, ఒక నెల కాదు.. ఏడాదిపాటు కనిపించిన కేఎఫ్‌సీ ఔట్‌లెట్లకు తిరుగుతూ, వెళ్లిన ప్రతిచోటా ఇదే కహానీ చెబుతూ.. కడుపారా చికెన్ తినేస్తూ వచ్చాడు. కానీ చివరికి ఒకరోజు అతడి పాపం పండి.. దొరికిపోయాడు. అయితే అతడు ఎవరనే వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించడం లేదు.


 

- Advertisement -