ముంబై: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అభిమానులను కలచివేసింది. బాలీవుడ్‌లోని కొందరు వ్యక్తుల వల్ల సుశాంత్ పలు సందర్భాల్లో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు వార్తలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీరంగంలో అడుగుపెట్టిన సుశాంత్‌కు బాలీవుడ్ పెద్దల నుంచి సరైన ప్రోత్సహం లేదని మండిపడుతున్నారు.
వారి తీరుకు నిరసనగా సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ బాలీవుడ్’కు పిలుపునిచ్చారు. బాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతలు, దర్శకులు అందరూ వారసత్వ నటులకే ఆఫర్లు ఇస్తున్నారని, అవార్డు వేడుకల్లో సైతం వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ పోస్టులతో విరుచుకుపడుతున్నారు.
ఇలాంటి వారిని అన్‌ఫాలో చేయాలని, వారి సినిమాలను నిషేధించాలంటూ పెడుతున్న పోస్టులకు స్పందన లభిస్తోంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాల్లో సదరు నటీనటులు, దర్శక నిర్మాతలను అన్‌ఫాలో చేస్తున్నారు. దీంతో నటీనటుల ఫాలోవర్ల సంఖ్య పడిపోతోంది.