హీరోయిన్ సోనాక్షి సిన్హాపై ఎఫ్ఐఆర్! రూ.37 లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఫిర్యాదు…

sonakshi-sinha
- Advertisement -

bollywood-heroine-sonakshi

మొరాదాబాద్: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైంది. రూ. 37 లక్షలు తీసుకుని తమను మోసగించిందంటూ ఓ ఈవెంట్ సంస్థ మేనేజర్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ మేరకు సోనాక్షి సిన్హాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే…

మొరాదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈవెంట్ మేనేజర్ ప్రమోద్ సిన్హా తాను నిర్వహించే ఇండియా ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమానికి రావాల్సిందిగా సోనాక్షి సిన్హాను కలిసి ఒప్పించారు. ఇందుకు రూ. 28.17 లక్షలను నాలుగు ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారా ఆయన ఆమె బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశారు.

ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు చేసినా…

సెప్టెంబర్ 30న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రమోద్ సిన్హా, ఆ ఈవెంట్ కోసం మరో రూ. 9 లక్షలను కూడా ఖర్చు చేశారు.  అంతేకాదు, హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రయాణానికి అవసరమైన టికెట్లను, బస ఏర్పాట్లనూ కూడా చేశారు. అయితే, సోనాక్షి మాత్రం ఆ ఈవెంట్‌కు హాజరుకాలేదు.

దీంతో తన వద్ద నుంచి డబ్బు తీసుకుని కూడా సోనాక్షి ఈవెంట్‌కు రాలేదని, దీని వల్ల తన సంస్థకున్న పేరు దెబ్బతిందని ప్రమోద్ పోలీసులకు ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వద్ద డబ్బు తీసుకున్న తరువాత, ఆమె ఇతర అవార్డు ప్రమోషనల్ వీడియోల్లోనూ నటించారని ఆరోపించారు.

సెప్టెంబర్ 30న ఉదయం 10 గంటలకు విమానం ఎక్కాల్సిన ఆమె ఎయిర్‌పోర్టుకు రాలేదని, ఆపై 3 గంటల విమానానికి టికెట్లు బుక్ చేయగా, అప్పుడు కూడా ఆమె ఎగ్గొట్టిందని ప్రమోద్ సిన్హా తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు హీరోయిన్ సోనాక్షి సిన్హాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఖట్ గర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.

- Advertisement -