
ముంబై: బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ గుర్తుంది కదా? కరోనా బారిన పడి చికిత్స అనంతరం ఇంటికి చేరిన ఈ గాయని ప్రస్తుతం తన ఇంట్లో లేరు. ఎక్కడికెళ్లారో తెలియదు. ఇది అధికారులకు పెద్ద పరీక్షలా మారింది.
మార్చి 9న లండన్ నుంచి వచ్చి ఉత్తర ప్రదేశ్‌లోని ఒక హోటల్లో బస చేసిన కనికా ఆ క్రమంలోనే ఓ పార్టీకి కూడా హాజరై అక్కడ పలువురు సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులను కలుసుకున్నారు.
ఆ తర్వాత ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో అందరు ఉలిక్కిపడ్డారు. దేశంలో కరోనా వైరస్ కదం తొక్కుతున్న వేళ.. అత్యంత బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించినందుకు కనికాపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఉత్తరప్రదేశ్ లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్చారు.
వరసగా ఐదుసార్లు కరోనా పాజిటివ్ రాగా…
అక్కడ ఆమెకు చికిత్స అందించినా.. వరసగా ఐదుసార్లు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె మరింత ఎక్కువ కాలం ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆరోసారి చేసిన కరోనా వైరస్ టెస్టింగ్‌లో ఆమెకు నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే డిశ్చార్జ్ తర్వాత కనికాని 14 రోజుల పాటు తన ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. తాజాగా ఆమె ఇంట్లో ఉందో లేదో తెలుసుకుందామని ప్రయత్నించిన అధికారులు ఆమె తన ఫ్లాట్‌లో లేకపోవడంతో షాక్ తిన్నారు.
ఆమెపై నమోదైన కేసులో విచారణ కోసం ఆమె ఫ్లాట్‌కు వెళ్లగా ఆమె అక్కడ లేకపోవడం అధికారులను అయోమయానికి గురి చేసింది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందో తెలియక అధికారులు టెన్షన్ పడుతున్నారు.








