
హైదరాబాద్: ఈ నెల 5న రాత్రి 9 గంటలకు దేశ ప్రజలందరూ ఇంట్లోని లైట్లను ఆఫ్ చేసి దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ ఉదయం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. 130 కోట్ల మంది ప్రజల సామూహిక శక్తి ప్రతి ఒక్కరిలో కనిపించిందని ప్రశంసించారు. కరోనా వైరస్‌పై ఒక్కటిగా పోరాడిందన్నారు.
కరోనాతో ఏర్పడిన అంధకారాన్ని పోగొట్టేందుకు దివ్య వెలుగుల్ని ప్రసరింపచేయాలన్నారు. ఈ నెల 5న ఆదివారం 130 కోట్ల మంది ప్రజలు మహాశక్తి జాగరణ చేయాలన్నారు.
దేశ ప్రజలు మహాసంకల్పాన్ని ప్రదర్శించాలన్నారు. ఆ రోజు రాత్రి 9 గంటలకు ప్రతి ఒక్కరూ ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి దీపాలను వెలిగించాలన్నారు. ఇందుకోసం కేవలం 9 నిమిషాల సమయాన్ని కేటాయించాలని కోరారు.
ఆ ప్రకాశంతో అంధకారాన్ని పారదోలాలని, తాము ఒంటరిగా లేమన్న సందేశాన్ని వినిపించాలని ప్రధాని కోరారు. సామాజిక దూరాన్ని ఎప్పుడూ ఉల్లంఘించవద్దన్నారు.
5న ఒంటరిగా కూర్చుని మహాభారతాన్ని గుర్తు చేసుకోవాలని, 130 కోట్ల ప్రజల సంకల్పాన్ని ఆలోచించాలన్నారు. గెలవాలన్న ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలన్నారు. ఈ ప్రపంచంలో మనశక్తితో జయించలేనిది ఏదీ లేదని ప్రధాని అన్నారు








