
న్యూఢిల్లీ: పాకిస్థాన్ హద్దు మీరితే తగిన బుద్ధి చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత త్రివిధ దళాధికారులు స్పష్టం చేశారు. ‘పాకిస్తాన్ వాయుదళం మన సైనిక స్థావరాల ధ్వంసానికి చేసిన ప్రయత్నాన్ని విజయవంతంగా తప్పికొట్టాం. పాక్ ఎఫ్- 16 యుద్ధ విమానాన్ని కూల్చేశాం. ఈ ప్రక్రియలో మన మిగ్- 21 బైసన్ యుద్ధ విమానం పాక్ అక్రమిత కాశ్మీర్లో పడిపోయింది’అని వెల్లడించారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్, మేజర్ జనరల్ సురేంద్రసింగ్ బహల్, రియర్ అడ్మిరల్ దల్బీర్‌సింగ్ గుజ్రాల్లు గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు. బాలాకోట్ ఉగ్రవాదుల స్థావరంపై జరిపిన దాడి, పాక్‌కు జరిగిన నష్టానికి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని, కేంద్రం అనుమతిస్తే బయటపెడతామని ఎయిర్ వైస్ మార్షల్ కపూర్ వెల్లడించారు.
శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సైన్యం,నావికాదళం, వాయు దళం తమ సర్వశక్తులు ఒడ్డేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని, త్రివిధ దళాలు ఒక్కటిగా ముందుకు సాగుతాయని ప్రకటించారు. తమ దాడి శత్రు లక్ష్యాలపై వేగంగా,పటిష్టంగా ఉంటాయని వారు తెలిపారు. పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ది చెప్పేందుకు త్రివిద ధలాలు పూర్తి అప్రమత్తతో ఉన్నాయని వారు తెలిపారు.
మొదట ఏయిర్ వైస్ మార్షల్ కపూర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ వాయుదళానికి చెందిన 24 యుద్ధ విమానాలు రజోరీ, నౌషేరా ప్రాంతంలోని మన సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు ప్రయత్నించటం, మన వాయుదళం తప్పికొట్టటంతోపాటు ఒక ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూల్చివేయటం తదితర వివరాలు వెళ్లడించారు. రజౌరీ ప్రాంతంలోకి పాక్ యుద్ధ విమానాలు చొచ్చుకు వచ్చి మన సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు ప్రయత్నించాయని ఆయన తెలిపారు.
మన వాయుదళానికి చెందిన సుకోయ్, మిరాజ్, మిగ్ 21 బైసన్ యుద్ధ విమానాలు వాటిని ఎదుర్కొని తిప్పికొట్టాయన్నారు. పాక్ యుద్ధ విమానాలు వేసిన బాంబులు మన సైనిక స్థావరాలకు ఎలాంటి నష్టం కలిగించలేకపోయాయని కపూర్ చెప్పారు. పాక్ వాయుదళానికి చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని మన మిగ్ 21 బైసన్ కూల్చివేసింది, అది వెళ్లి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పడిపోయిందని కపూర్ వివరించారు.
పాకిస్తాన్ ఎఫ్ 16 యుద్ధ విమానాలను ఉపయోగించలేదని అబద్దాలు చెబుతోంది, అయితే ఎఫ్ 16 ప్రయోగించిన అమ్రాం ఏయిర్ ఏయిర్ మిస్సైల్ శకలాలు తమ వద్ద ఉన్నాయంటూ వాటిని ప్రదర్శించారు. మిగ్ 21 బైసన్ యుద్ధ విమానం కూల్చివేసిన ఎఫ్ 16 ఇతర శకలాలను కూడా వారు ప్రదర్శించారు.
పాక్ అబద్ధాలు చెబుతోంది..
భారత దేశానికి చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేసి ముగ్గురు పైలట్లను పట్టుకున్నట్లు మొదట ప్రకటించిన పాకిస్తాన్ తరువాత మాట మార్చి ఒక యుద్ధ విమానం ఇద్దరు పైలట్లు తమ వద్ద ఉన్నట్లు చెప్పాయి, చివరకు వారు ఒక విమాన్నా కూల్చివేసి ఒక పైలట్‌ను పట్టుకున్నట్లు చెప్పాయంటూ ఇన్ని అబద్దాలు చెప్పటం చూస్తుంటే వారి పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చునని కపూర్ వ్యాఖ్యానించారు.
వాస్తవానికి మన మిగ్ 21 బైసన్ విమానాన్ని పాకిస్తాన్ కూల్చలేదు, అది ఎఫ్ 16ను కూల్చివేసిన అనంతరం పాకిస్థాన్‌లో పడిపోయిందని కపూర్ తెలిపారు. పారాచూట్‌తో దిగిపోయిన వింగ్ కమాండర్ పాక్ అక్రమిత కాశ్మీర్లో పడ్డారని ఆయన తెలిపారు. ఎఫ్ 16 యుద్ధ విమానం కూలిపోయి దానిలోని ఇద్దరు పైలట్లు పారాచూట్లతో దూకటం మన సైనికులు చూశారని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత దేశంలోని ఖాలీ స్థలంలో తమ యుద్ధ విమానాలు బాంబులు వేశాయంటూ పాకిస్తాన్ అబద్దాలు చెప్పిందన్నారు. తమ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేయలేదంటూ పాకిస్తాన్ తప్పుడు సమాచారం ఇస్తోందని ఆయన దుయ్యబట్టారు. వింగ్ కమాండర్ అభినందన్ వస్తున్నాడతనే వార్త తమకు ఆనందం కలిగించింది, ఆతని రాకకోసం ఎదురు చూస్తున్నామని కపూర్ చెప్పారు.
పాకిస్తాన్ వాయుదళం మన సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు ప్రయత్నించి విఫలమైందని మేజర్ జనరల్ సురేందర్ సింగ్ మహల్ చెప్పారు. పాకిస్తాన్ సైన్యం చేస్తున్న కాల్పుల విరమణ ఉల్లంఘణను తప్పికొట్టేందుకు సైన్యం ధీటుగా సమాధానం ఇస్తోందని ఆయన ప్రకటించారు. ఎల్.ఓ.సి, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద మన సైన్యం అత్యంత అప్రమత్తతతో ఉన్నది, ఏయిర్ డిఫెన్స్ సిస్టం శతృ విమానాలను కూల్చివేసేందుకు సిద్దంగా ఉన్నదని మహల్ తెలిపారు. మెకనైజిడ్ దళాలు కూడా సిద్దంగా ఉన్నాయి, పాకిస్తాన్ నుండి ఎలాంటి కవ్వింపు ఎదురైనా ధీటుగా బదులిస్తామన్నారు.
భారత నావికాదళం అత్యంత అప్రమత్తంగా ఉన్నది, తమ దళాలు సముద్రం లోపల, పైన, ఆకాశంలో శతృవులకు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నామని నావికాదళం రియర్ అడ్మిరల్ గుజ్రాల్ తెలిపారు. ‘పాక్ అధీనంలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేస్తానన్న పాక్ ప్రకటన సంతోషకరం. జెనీవా ఒప్పందానికి కట్టుబడి వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నాం’ అని తెలిపారు.








