
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీయే కేంద్రంలో మరోసారి కొలువుదీరింది. గురువారం రాత్రి 7 గంటలకు భారత ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఇక ఆయనతో పాటు మొత్తం 58 మందితో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం 82 మందికి చోటు కల్పించడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రధానమంత్రి తొలి విడత 57 మందికి అవకాశం ఇచ్చారు. ఇందులో ఆరుగురు మహిళలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మొత్తం 23 రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు. ఆంధ్రప్రదేశ్, ఆరు ఈశాన్యరాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలకు ఎలాంటి ప్రాతినిధ్యం లభించలేదు. తెలంగాణ నుంచి జి.కిషన్‌రెడ్డి ఒక్కరే ప్రమాణస్వీకారం చేశారు.
ఇక 57 మంది గల మంత్రివర్గంలో 24 మందికి కేబినెట్, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మంది సహాయ మంత్రులుగా అవకాశం దక్కింది. అలాగే మంత్రివర్గంలో 20 మంది కొత్తవారికి అవకాశం దక్కగా… 35 పాతవారిని పక్కనబెట్టారు.
ఇక మోడీ కేబినెట్ శుక్రవారం సాయంత్రం తొలిసారిగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ తొలి భేటీ జరగనుంది. ప్రస్తుతానికి ఈ మీటింగ్‌కు ఎలాంటి ఎజెండా నిర్ణయించలేదని, పార్లమెంట్ సమావేశాల నిర్వహణ తేదీపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.








