‘చిట్టి’.. ఈ మాట.. భారతీయులందరికీ సుపరిచితమే.
ఎందుకంటే.. ఓ ఎనిమిదేళ్ల క్రితం ఈ చిట్టి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. ఇంకా గుర్తుకురాలేదా? అదేనండి.. మన ‘చిట్టి.. బాబు’
టాప్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన రోబో సినిమాలో.. ‘చిట్టి’ పాత్రలో నటించి సూపర్బ్ అనిపించిన రజినీకాంత్.. చాలా రాజుల తర్వాత దీపావళి సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతేకాదు, ఇన్నాళ్లూ తన మనసులో దాగి ఉన్న మాటలను కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. ఇంతకీ ఆ ‘చిట్టి’ మనసులో దాగి ఉన్న ఆ మాటేమిటంటే…
మీరింతమంది హీరోయిన్లతో చేశారు కదా? మీ బెస్ట్ పెయిర్ ఎవరూ అనడిగితే.. ఒక సాధారణ హీరోయిన్ పేరు చెప్పి అందరినీ ఔరా.. అనిపించారు రజినీకాంత్. ఎందుకంటే ఆనాటి అందాల తారలు జయప్రద, జయసుధ, శ్రీదేవి, రాధ.. ఇలా ఎంతోమంది ఉన్నా.. అంతగా పేరులేని ఓ అమ్మాయి పేరు చెప్పి.. అందరూ ముక్కున వేలేసుకునేలా చేశారాయన.
ఇంతకీ ఆ అదృష్టవంతురాలు ఎవరో తెలుసా?
ఒక్క క్షణం ఆగండి.. ఎందుకంటే.. ఆ హీరోయిన్ గురించి చెప్పాలంటే.. మన తెలుగులో కె.బాలచందర్ అద్భుతంగా తెరకెక్కించిన ఒక మధ్య తరగతి కుటుంబం సినిమా అది.. పేరు ‘ అంతులేని కథ’.. అందులో హీరోయిన్ జయప్రద.. తన స్నేహితురాలిలా నటించిన ఆనాటి నటే.. తన మేటి నటిగా చెప్పారు రజినీకాంత్.
ఇంతకీ ఆ నటి పేరు.. జయలక్ష్మి.. అంటే అర్థం కాలేదు కదా.. ఫటాఫట్ జయలక్ష్మి అంటేనే అర్థమవుతుంది.. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్‌కి అంత పేరు వచ్చింది మరి.
ఆమెనే ఎందుకు ఇష్టపడ్డాడంటే…
జయలక్ష్మి నటిస్తే.. ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. అందుకు అంతులేని కథ సినిమాయే ఉదాహరణ.. ఆ సినిమాలో తన ఊతపదమే.. ఇంటిపేరుగా మారిపోయి.. ఫటాఫట్ జయలక్ష్మిగా స్థిరపడిపోయింది.
‘‘ఆమె అభినయం, ఆమె ఇన్వాల్వ్‌మెంట్ నాకు నచ్చేది. అలాగే మేం నటించిన చిత్రాల్లో నాకు బెస్ట్ పెయిర్ గా తననే చెబుతాను..’’ అంటూ ఈ ‘చిట్టి’ తన మనసులోని మాట బయటపెట్టారు. అయితే రజినీకాంత్ కొంత క్రెడిట్ నటి రాధికకి కూడా ఇవ్వడం విశేషం. ఫటాఫట్ జయలక్ష్మి తర్వాత సెకెండ్ ప్లేస్ రాధికకి ఇచ్చారాయన.
తెలుగులో 14, తమిళంలో 33 సినిమాల్లో నటించిన జయలక్ష్మి…
ఫటాఫట్ జయలక్ష్మి తెలుగులో టాప్ హీరోలు.. సూపర్ స్టార్ కృష్ణ పక్కన హీరోయిన్‌గా ‘భలే అల్లుడు’ సినిమాలో నటించింది. ఏయన్నార్ నటించిన చిలిపి కృష్ణుడులో, ఎన్టీఆర్..యుగపురుషుడులో.. సెకండ్ హీరోయిన్‌గా మరికొన్ని సినిమాల్లో సెకెండ్ హీరోలు మురళీమోహన్, చంద్రమోహన్ ఇలా వీరి సరసన 14 సినిమాల్లో నటించింది. తమిళంలో 33, కన్నడం, మళయాళంల్లో కలిపి 66 సినిమాల్లో ఆమె నటించడం విశేషం.
22 ఏళ్లకే విషాదాంతం..
కెరీర్ అద్భుతంగా కొనసాగుతున్న దశలో.. తన మేనమామ రామచంద్రన్‌ని వివాహం చేసుకున్న జయలక్ష్మి.. కుటుంబ గొడవల కారణంగా 22 ఏళ్లకే ఆత్మహత్య చేసుకొని మరణించడం విషాదం. భారతదేశ సినీ చరిత్ర రాస్తే.. రజినీకాంత్ ఒక సరికొత్త అధ్యాయం అని చెప్పాలి.
ప్రపంచవ్యాప్తంగా ఒక ఇమేజ్ తెచ్చుకునే స్థాయికెదిగిన రజనీకాంత్‌లాంటి వ్యక్తి.. తనకి నచ్చిన హీరోయిన్ అంటూ.. ఫటాఫట్ జయలక్ష్మి పేరు చెప్పడం గొప్ప విషయం. నిజంగా తను జీవించి ఉంటే.. ఈరోజున ఎంతో ఆనందించేది. ఒకరకంగా చెప్పాలంటే దీనిని రజినీకాంత్.. తన సహనటికి ఇచ్చిన ఒక గొప్ప నివాళిగా నెటిజన్లు పేర్కొంటున్నారు.