ప్రొ కబడ్డీ లీగ్‌: చెలరేగిన తెలుగు టైటాన్స్‌ డిఫెండర్లు.. పాట్నా పైరేట్స్‌పై సంచలన విజయం

telugu titans patna pirates
- Advertisement -

 

telugu titans patna pirates

పూణే: ప్రో కబడ్డీ లీగ్‌ 2018 సీజన్‌ 6లో తెలుగు టైటాన్స్‌ మరో గెలుపుని అందుకుంది. గత మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన టైటాన్స్‌.. శుక్రవారం జోన్‌-బిలో జరిగిన మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శనతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పాట్నా పైరేట్స్‌ను 35-33 పాయింట్లతో ఓడించింది.

ఉత్కంఠభరితంగా సాగిన  ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలోని డిఫెండర్లు తమ సత్తాను ప్రదర్శించారు. విశాల్‌ భరద్వాజ్‌, అబోజర్‌ కలిపి 11 ట్యాకిల్‌ పాయింట్లతో నిలేష్‌ 5 పాయింట్లతో టైటాన్స్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రాహుల్‌ చౌదరి 7 రైడ్‌ పాయింట్లతో ఆకట్టుకున్నాడు.

మొదటి అర్ధభాగం ఆట పూర్తయ్యేసరికి పాట్నా పైరేట్స్ జట్టు 17-14 స్కోరుతో ఆధిక్యంలో నిలిచినప్పటికీ.. రెండో అర్ధభాగంలో తెలుగు టైటాన్స్‌ పుంజుకుంది. రెండు బోనస్‌ పాయింట్లతోపాటు ట్యాకిల్‌ పాయింట్‌తో 27వ నిమిషంలో ఆ జట్టు 22-21 స్కోరుతో ఆధిక్యంలోకి వచ్చింది.

ఈ క్రమంలో ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. 33వ నిమిషానికి టైటాన్స్‌ 29-28 స్కోరుతో నిలిచింది.  ఒక దశలో స్కోరు 30-30తో సమం కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  చివర్లో  తెలుగు టైటాన్స్‌ రైడర్లు, డిఫెండర్లు అత్యంత ఒత్తిడిలోనూ అద్భతమైన ఆటను ప్రదర్శించారు.

మరో 3 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా తెలుగు టైటాన్స్‌ ఆటగాళ్లు అద్భుతంగా ఆడి 5 పాయింట్లతో .. జట్టుకు విజయాన్నందించారు.  పాట్నా పైరేట్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. పైరేట్స్‌ జట్టులో మంజీత్‌ 8 పాయింట్లు, విజయ్‌ 8 పాయింట్లు, పర్దీప్ 5 పాయింట్లతో మెరిసినా ఆ జట్టుకు ఓటమి మాత్రం తప్పలేదు.

పుణేరి పల్టన్‌ Vs  జైపుర్‌ పింక్‌పాంథర్స్‌ మ్యాచ్‌లో…

పోటాపోటీగా సాగిన మరో మ్యాచ్‌లో.. పుణేరి పల్టన్‌ 29-25 స్కోరుతో.. జైపుర్‌ పింక్‌పాంథర్స్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల డిఫెన్స్‌ బలంగా కనిపించింది. రవికుమార్‌ 6 ట్యాకిల్‌ పాయింట్లు, మోను 5 రైడ్‌ పాయింట్లతో పుణేరి పల్టన్ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు.

జైపుర్‌ పింక్‌పాంథర్స్‌ జట్టులో దీపక్‌ హుడా 5 ట్యాకిల్‌ పాయింట్లు సాధించాడు. మొదటి అర్ధభాగం ముగిసేసరికి 13-12  స్కోరుతో ఆధిక్యంలో నిలిచిన పుణేరి పల్టన్‌.. రెండో అర్ధభాగంలో కొంచెం దూకుడు పెంచింది. మ్యాచ్ చివరికంటా 4, 5 పాయింట్ల ఆధిక్యాన్ని కొనసాగించిన ఆ జట్టు.. చివరికి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో జోన్‌-ఎ పుణేరి పల్టన్ (20 పాయింట్లు), యూ ముంబా (18 పాయింట్లు) టాప్‌-2లో ఉన్నాయి. జోన్‌-బిలో తెలుగు టైటాన్స్‌ (16 పాయింట్లు), పాట్నా పైరేట్స్‌ (11 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -