ప్రో కబడ్డీ: పర్దీప్ నర్వాల్ మెరుపులు, యూపీ యోధాపై.. పాట్నా పైరేట్స్ గెలుపు

Patna_Pirates
- Advertisement -

Patna_Pirates

సోనేపట్: ప్రో కబడ్డీ లీగ్‌లో డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ సత్తా చాటడంతో పాట్నా పైరేట్స్ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పర్దీప్‌తో పాటు డిఫెండర్లు కూడా అద్భుత ప్రదర్శన చేయడంతో పాట్నా పైరేట్స్ 43-37 స్కోరుతో ప్రత్యర్థి జట్టు యూపీ యోధాపై నెగ్గింది.  ఇరు జట్లు హోరాహోరీగా తలపడడంతో మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది.  చివరికి పాట్నా పైరేట్స్ విజయదుందుభి మోగించింది.  దీంతో పరాజయాల్లో యూపీ యోధా హ్యాట్రిక్‌ను నమోదు చేసినట్లయింది.

రిషాంక్‌ దేవడిగ వరుస పాయింట్లు సాధించడంతో ఆరంభంలో యూపీ యోధా జట్టు 3-1 స్కోరుతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ వెంటనే పాట్నా పైరేట్స్ డిఫెండర్లు సూపర్‌ టాకిల్ ద్వారాఆ ఆధిక్యాన్ని 3-6కు తగ్గించారు. ఆ తరువాత మరో సూపర్‌ టాకిల్ చేసి 7-7తో స్కోరును సమం చేశారు.

శ్రీకాంత్‌, పర్దీప్‌ పోటీపడి మరీ…

అయితే శ్రీకాంత్‌ జాదవ్‌ వరుసబెట్టి పాయింట్లు సాధించడంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి యూపీ యోధా జట్టు 17-19తో తిరిగి పోటీలోకి వచ్చింది. విరామం తర్వాత యూపీ యోధా తరపున శ్రీకాంత్‌, పాట్నా పైరేట్స్ నుంచి పర్దీప్‌ నర్వాల్ పోటీపడి మరీ పాయింట్లు కొల్లగొట్టారు. దీంతో ఓ దశలో స్కోరు 24-24తో సమమయింది. అప్పుడే పర్దీప్‌ సూపర్‌ రైడ్‌ సాధించి జట్టు స్కోరును పెంచాడు. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 39-34 స్కోరుతో నిలిచిన పాట్నా పైరేట్స్ అదే జోరును కొనసాగించి మ్యాచ్‌ సొంతం చేసుకుంది.

పర్దీప్ నర్వాల్ అయితే రైడింగ్‌కు వెళ్లినపుడల్లా పాయింట్‌ సాధిస్తూ వచ్చాడు. 14వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి పట్నా 16-10 ఆధిక్యం సాధించింది. పర్దీప్ నర్వాల్ 14 రైడింగ్ పాయింట్లతో పాట్నా పైరేట్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యూపీ యోధా రైడర్ శ్రీకాంత్ జాదవ్ 17 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచినా ఆ జట్టుకు విజయన్ని అందించలేక పోయాడు.

మరో మ్యాచ్‌లో…

ఆ తరువాత జరిగిన మరో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్ 45-27 స్కోరుతో హర్యానా స్టీలర్స్‌ జట్టును చిత్తు చేసింది.  ప్రో కబడ్డీ లీగ్‌ 2018 సీజన్లో-6లో సోమవారం మ్యాచ్‌లకు విరామం.  అంటే.. ఈరోజు ఏ మ్యాచ్ ఉండదన్నమాట.

- Advertisement -